May 09,2023 00:21

ప్రజాశక్తి-ముమ్మిడివరం, కొత్తపేట పంట నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, కొత్తపేటలో ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కష్ణయ్య సోమవారం పర్యటించారు.
ముమ్మిడివరం మండలం ఠానేలంకలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను వారు పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎంఎల్‌సి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు కేరళ ప్రభుత్వం చేపడుతున్నట్టు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కోత కోసే దళాలను రప్పించి ఇటువంటి ప్రదేశాల్లో పని చేయించి రైతులకు రక్షణగా నిలబడాలని, యంత్రాలను కూడా రప్పించి రైతులకు తోడుగా నిలబడాలని సూచించారు. సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని ఎప్పుడు, ఎంతకు కొంటారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా అత్యవసర పరిస్థితిగా భావించి ధాన్యాన్ని కొనాలన్నారు. అవసరమైతే వాలంటీర్ల పర్యవేక్షణలో నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, కౌన్సిల్‌ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రవేశపెడతామని అన్నారు.
కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తామని చెప్పిందని, కానీ రైతులు పండుగ కాదు కదా ఎంతో విషాదంలో ఉన్నారన్నారు. అకాల వర్షాలు వస్తే ఆదుకోవడానికి తగిన చర్యలు చేపట్టకపోవడమే దీనికి కారణమన్నారు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులు చాలా పెట్టుబడులు పెట్టి ఈరోజు పంటను అమ్ముకోలేక కమీషన్‌ వ్యాపారుల ద్వారా అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వం తాము ఇన్ని మెట్రిక్‌ టన్నులు కొన్నట్లు లెక్కలు చూపిస్తోందే తప్ప ఆచరణలో రైతులను ఎన్నో ఇబ్బందులకు ఈ ప్రభుత్వం గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం ఆర్‌బికెల్లో సరిపోతుంది కానీ మిల్లు దగ్గర యంత్రాన్ని వేగంగా తిప్పి ఇంకా తేమశాతం ఎక్కువగా ఉందని చెప్పి ఆ తేడా శాతానికి కూడా డబ్బులు కట్టాలని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి ట్రాక్టర్‌కూ రూ.5 వేల నుంచి రూ.23 వేల వరకు మిల్లులకు కడితేనే వారు ఆ ధాన్యాన్ని తీసుకుంటున్నారన్నారు. ఈ విధంగా అష్టదిగ్బంధనం చేసి రైతాంగాన్ని ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతోందన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో రైతులందరూ చాలా ఆందోళన చెందారన్నారు. దీన్ని ఒక అత్యవసర పరిస్థితిగా భావించి అవసరమైన యంత్రాలను తెప్పించి, అవసరమైతే కోత కోసే కూలీలను రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుడుపూడి రాఘవమ్మ, కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గాప్రసాద్‌, కెవిపిఎస్‌ నాయకులు ఎలమంచిలి బాలరాజు పాల్గొన్నారు.