ప్రజాశక్తి- కోరుకొండ ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవాలకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అధికారులకు సూచించారు. కోరుకొండలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంఎల్‌ఎ రాజా సమీక్షించారు. రాష్ట్రం నలుమూలల నుంచి యాత్రికుల హాజరయ్యే అవకాశమున్నందున వారి సంఖ్యను ముందుగానే అంచనావేసి సమన్వయంతో పనిచేసి ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనున్న ఉత్సవాలకు భారీగా తరలివచ్చే అవకాశమున్నందున పారిశుధ్యంపై ప్రత్యేక దష్టి కేంద్రీకరించాలని, ఇతర పంచాయతీలతో పాటు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా సిబ్బందిని ఇక్కడ నియమించాలని రాజా సూచించారు. గత ఏడాది మాదిరిగానే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా కల్యాణోత్సవం, రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎంఎల్‌ఎకోరారు. అన్నవరం దత్తత ఆలయం అయినందున ఆ ఆలయ ఛైర్మన్, ధర్మకర్తల మండలి, అధికారుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైనన్ని ఆర్‌టిసి బస్సులు నడపాలని, విద్యుత్ శాఖ కూడా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలని రాజా సూచించారు. అనంతరం కళ్యాణోత్సవం గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సమావేశంలో అన్నవరం దేవస్థానం ఇఒ ఎన్‌విఎస్.మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ డిఎల్‌ఒ రమేష్ బాబు, డిఎస్‌పి కె.వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ నరేష్ కుమార్, తహశీల్దారు పాపారావు, అన్నవరం ఆలయ ఇఇ నూకరత్నం, ధర్మకర్తల మండలి సభ్యులు తాడి రజని, కోరుకొండ ఆలయ ఛైర్మన్ ఎస్‌పి రంగరాజు బట్టర్, ఆర్.రవికుమార్, కోరుకొండ జెడ్‌పిటిసి సభ్యులు కర్రి నాగేశ్వరరావు, రాజానగరం మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కా రాంబాబు ఉన్నారు.










