ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. దళారులు నేరుగా లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు ఎగుమతి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం జిల్లాలో అక్రమార్కులు సిండికేటై లావాదేవీలు చేస్తున్నట్లు సమాచారం. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి తిరిగి బహిరంగ మార్కెట్లో రక రకాల బ్రాండ్ల పేరుతోవిక్రయాలు చేస్తున్నారు. రేషన్ బియ్యం మాఫియా పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ అక్రమాలకు అడుడ్డకట్ట పడటంలేదు. లోకల్‌గా సేకరించిన బియ్యంతో పాటు తెలంగాణ నుంచి రేషన్ బియ్యం కూడా ఇక్కడి మిల్లులకు సరఫరా జరుగుతున్నట్టు అధికారుల దాడులలో గతంలో వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. మిల్లులకు ఇలా చేరుతున్న బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి, తళతళలాడే తెల్లని తెలుపు వచ్చేలా పాలిష్ చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బియ్యాన్ని వాహనాల మార్చి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలయత్నం అవుతున్నాయి.
లబ్ధిదారుల నుంచి రూ.15 చొప్పున కొనుగోలు
లబ్ధిదారుల నుంచి కేజీ రూ.15 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటింటికీ రేషన్ వాహనాల నిర్వహకులు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర తీసుకుని లబ్ధిదారులకు కోటా బియ్యాన్ని అందజేస్తున్నారు. కొన్నిసార్లు బియ్యం నాణ్యత లేకపోవడం, అనారోగ్యాలు రావడం వంటి కారణాల వల్ల చాలా మంది ఈ బియ్యాన్ని వినియోగించడం లేదు. ప్రభుత్వం సన్నబియ్యం అందజేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు. పట్టణాల్లో రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోసల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజు వారీ భోజనానికి వినియోగించడం లేదు. వరుసగా మూడు నెలల పాటు పిడిఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పని సరిగా బయోమెట్రిక్ వేసి కొన్నిసార్లు డీలర్లకే కిలో రూ.13 చొప్పున ఆ బియ్యాన్ని ఇచ్చేస్తున్నారు. ఇలా రేషన్‌కు వచ్చే బియ్యంలో రీసేల్ అవుతుండగా 80 నుంచి 85 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. ఈ బియ్యాన్నే డీలర్లు, లబ్ధిదారుల నుంచి వ్యాపారులు, దళారులకు కిలో రూ.18 చొప్పున రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. వీటిపై విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టినా ఫలితం ఉండడం లేదు.
యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయాలు
లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని యథేచ్ఛగా తిరిగి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 50 శాతానికి పైగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మరో 50 శాతం లోకల్ మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేరుతో యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి 25 కేజీల బస్తా రూ.1050 నుంచి రూ.1100 చొప్పున బియ్యం వ్యాపారులు తిరిగి విక్రయిస్తున్నారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేరుతో సైతం కొన్నిసార్లు రీ సైక్లింగ్ బియ్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో బియ్యం ధరలు 25 కేజీల బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకూ ధరలు పెరిగిన విషయం విదితమే. దీంతో అత్యధిక మంది మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరకు వస్తున్నాయని పాలిష్ చేసిన బియ్యాన్ని కొనుగోలు చేసుకుని వినియోగిస్తున్నారు. ఈ దందాతో దళారులు, మిల్లర్లు పెద్ద ఎత్తున కూడబెట్టుకుంటున్నప్పటికీ, మధ్య, దిగువ తరగతి ప్రజలు ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజా పంపిణీ బియ్యం అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.










