ప్రజాశక్తి-రాజమహేద్రవరం
పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం చెల్లించాలని, ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు చేసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల పోరుకేక పేరుతో సిపిఎం నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. నేటి వరకు సిపిఎం జిల్లా కమిటీ సేకరించిన రూ.30వేల విరాళాన్ని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు అందించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల సమస్య ఈనాటిది కాదన్నారు. 16 ఏళ్లుగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై సీపీఎం పోరాడుతుందన్నారు. ప్రభుత్వం చెబుతున్నా కాంటూరు లెక్కలన్నీ తప్పు అని సిపిఎం పదేళ్లుగా చెబుతున్నా పట్టించుకోలేదన్నారు. ఈ లెక్కలు తప్పు అని చెప్పడానికి గత ఏడాది వచ్చిన వరదలు రుజువు చేశాయన్నారు. పరిహారం ఇవ్వకుండా నిర్వాసితులను ముంచేసే కుట్ర ప్రభుత్వం పన్నుతుందన్నారు. ప్రాజెక్టు పనులకు డబ్బులు ఉంటున్నాయి గానీ నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవు అనడం తగదన్నారు. స్పిల్ వే, డయాఫ్రమ్ వాల్ వంటివి నిర్మించడానికి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గిరిజనులు కావడంతో వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వరదలో చిక్కుకునీ కొండలు, గుట్టపై నెలల బాటు నానా ఇబ్బందులు పడ్డా, వారికి కనీసం సాయం కూడా అందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని అయన డిమాండ్ చేశాయి.. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నాయకులు సీతారాం, బి.పవన్,. ఎస్‌ఎస్.మూర్తి, లోతా రాంబాబు, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.










