ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి విజరు విహార్ సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందించారు. ఈ సందర్భ:గా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్. మాణిక్యంబ మాట్లాడుతూ తెలంగాణా కంటే అదనంగా ఎపిలో అంగన్‌వాడీలకు జీతాలు ఇస్తామని సిఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్న వారిపై ఆయనే కర్కశంగా వ్యవహరిస్తున్నారన్నారు. అణిచివేత ద్వారా, నిర్బంధాల ద్వారా పరిపాలన సాగించాలని జగన్ ప్రభుత్వం భావిస్తుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. పోరాడేతత్వం కలిగిన అంంగన్‌వాడీలతో దురుసుగా వ్యవహరించి జగన్ తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.శ్రీదేవి, ఎ. నరసమ్మ, సిహెచ్. బ్రహ్మమ్మ, ఎన్.శాంతకుమారి, జక్కల మణి, ప్రాజెక్టు సభ్యులు పాల్గొన్నారు.










