Mar 14,2023 23:27

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరీక్షల ఛీఫ్‌ సూపరింటెండెంట్‌ ఉమాదేవి

ప్రజాశక్తి - యంత్రాంగం
ఇంటర్‌ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిని నిరాకరిస్తారని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 1,02,643 మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారు.
గోపాలపురం : నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్‌ పరీక్షల ఛీఫ్‌ సూపరింటెండెంట్‌, ఉభయ కళాశాలల కస్టోడియన్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ టి.ఉమాదేవి తెలిపారు. గౌతమి జూనియర్‌ కళాశాలలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. 309 మంది మొదటి, 236 మంది ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరి కోసం 12 గదులను కేటాయించామని తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు 351, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 317 పరీక్షలు రాస్తున్నారన్నారు. వీరికి 14 రూములు కేటాయించామన్నారు. సిసి కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి విద్యార్థీ గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
కడియం : ఇంటర్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మండలంలోని మురమండ పిచ్చుక కోటయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎంఇఒ వి.లజపతిరారు తెలిపారు. కడియం షిర్డీ సాయి కాలేజీ నుంచి మొదటి, ద్వితీయ సంవత్సరాలకు గాను 126 మంది విద్యార్థులు, మురమండ జూనియర్‌ కళాశాల నుంచి 120 మంది విద్యార్థులు, కడియం జెడ్‌పి హై స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలికల జూనియర్‌ కళాశాల నుంచి 28 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.
నిడదవోలుకు తరలిన ఇంటర్‌ పరీక్షా కేంద్రం
చాగల్లు : చాగల్లు వెలగపూడి రామకృష్ణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని నిడదవోలు తరలించినట్లు ప్రిన్సిపల్‌ పావని తెలిపారు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 50 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు 83 మొత్తం 133 మంది విద్యార్థులు నిడదవోలు పరీక్షా కేంద్రంలో బుధవారం నుంచి పరీక్షలు రాస్తారని ఆమె తెలిపారు.