Feb 11,2023 23:44

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి పలు బిసి కార్పొరేషన్లు నిధులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. ఎస్‌సి, బిసిల అభివద్ధి కోసం అంటూ రెండేళ్ల కిందట ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత వాటికి నిధులు విదల్చడం లేదు. చైర్మన్‌లు, బోర్డు డైరెక్టర్‌లు ఏ పనీ చేయలేక.. కనీస స్థాయిలో రుణాలు ఇవ్వలేక నిరాశలో పడ్డారు. పదవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ సంతప్తి పడుతున్నారు. గతంలో ఏటా వెనుకబడిన తరగతుల్లో పేద నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు అందేవి. వాటితో సొంత వ్యాపారాలు చేసుకుని రాణించేవారు. ఇంకొందరు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. 56 కులాలకు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి కార్యవర్గాలను నియమించి వదిలేసింది. వారంతా దిష్టిబొమ్మల్లా మిగిలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వాటా లేక బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు రావడం లేదు. రుణాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ వారికి న్యాయం జరగడం లేదు. అత్యధిక మంది యువత రుణంపై ఆశలు వదులుకున్న ఆయన ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నారు దాదాపుగా రాయితీ రుణ పథకాలన్నీ నిలిచిపోయాయి.
కార్పొరేషన్‌లు పెరిగినా ఫలితం శూన్యం
16 కార్పొరేషన్లు గతంలో ఉండగా వైసిపి ప్రభుత్వం 56కి పెంచింది. సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించింది. ఆయా సామాజికవర్గాల సంక్షేమానికి కానీ.. నిరుద్యోగ యువతకు కాని రుణ పథకాలు ప్రకటించడం లేదు. గతంలో సంక్షేమ శాఖలు ప్రకటించే వార్షిక ప్రణాళికల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూసేవారు. వెనుకబడిన తరగతుల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కులాల వారీ ఏర్పాటు చేసుకునే సంఘాల (ఫెడరేషన్లు)కు 50 శాతం సబ్సిడీతో కూడిన గ్రూపు రుణాలను అందించేవారు. గరిష్టంగా రూ.30 లక్షల వరకూ మంజూరు చేసేవారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా అందజేశారు. 2018-19కి సంబంధించి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో రుణాలు మంజూరు ప్రక్రియను నిలిపివేశారు.