Jun 03,2023 23:40

సమీక్ష చేస్తున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం
పునాదుల స్థాయిలో ఉన్న ఇళ్లను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీ మౌలిక వసతుల అభివద్ధి పనులు, ఇంటి నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విస్తతంగా పడేలోగా పునాదులు స్థాయికి వచ్చిన ఇళ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లను ప్రోత్సహించి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులను, కాంట్రాక్టర్లను సమన్వయం చేసి ఎప్పటికప్పుడు వారికి చెల్లించాల్సిన మొత్తములు చెల్లించేలా చూడాలన్నారు. ఎమినిటీస్‌ సెక్రటరీలు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. పునాదులు కూడా ప్రారంభించని లబ్దిదారులను గుర్తించి వారిని సంప్రదించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. రెండవ దశలో ఇళ్ల నిర్మాణాలకు ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. అందులో రోడ్లు, డ్రైన్లు, నీటిసరఫరా, లైటింగ్‌ ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలన్నారు. కానవరం జగనన్న కాలనీ లే ఔట్‌లో పూర్తి స్థాయిలో వసతులకు అంచనాలు తయారు చేసి నిధులు మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాట్‌లు అన్నీ డిమార్కేషను చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్‌ పిఎం.సత్యవేణి, హౌసింగ్‌ అధికారులు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.