Jun 11,2023 22:54

  • వేసవి తీవ్రత నేపథ్యంలో 17 వరకూ ఒంటిపూట బడులు
  • ప్రకటనలతో వల వేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు
  • ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు ఉక్కిరి బిక్కిరవుతున్న తల్లిదండ్రులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
బడిగంట మోగింది. వేసవి సెలవులకు ఇక సెలవు చెబుతూ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాఠశాలలను తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ఈ నెల17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ తరగతులు జరుగనున్నాయి.
జిల్లాలో 990 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు మరో 650 వరకూ ఉన్నాయి. సుమారు 1.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ పాఠశాల ప్రారంభం రోజునే విద్యాకానుక కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమైంది. ఇప్పటికే విద్యాకానుక కిట్లను ఆయా పాఠశాలలు పంపేశామని అధికారులు చెబుతున్నారు. నేటితో ఈ పంపిణీ ఎలా ఉందో తేలనుంది. ఎప్పటిలానే ఈ ఏడూ ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా ఫీజులు పెంచుతూ భారీగా వసూలు చేస్తున్నా కనీస చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. నామమత్రంగా తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారు. గుర్తింపు లేని పాఠశాలలపైనా చర్యలు చేపట్టడం లేదు. కొన్ని పాఠశాలలకు నోటీసులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
ఐఐటి, ఎంబిబిఎస్‌ ఫౌండేషన్‌ పేరుతో అదనపు వసూలు
ప్రస్తుత విద్యాసంత్సరం మొదటి నుంచే భారీగా ఫీజులను పెంచారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఐఐటి ఇతర ఫౌండేషన్‌ల పేరిట తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పి సంవత్సరానికి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంస్థలను బట్టి ఫీజులను వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు నెలవారీగా రూ.1,500 నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు ఒకేసారి 20 నుంచి 40 శాతం వరకు పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తరగతి గదుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. చాలా పాఠశాలల్లో రేకుల భవనాలే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి వెలుతురు ఉండడంలేదు. పిల్లలకు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్‌ లేదు. అనుమతుల సమయంలో విద్యాశాఖ చేతివాటం వల్ల విద్యార్థులకు క్రీడాసౌకర్యాలు ఎండమావిగా మారుతున్నాయి. అలాగే పాఠశాల యాజమాన్యాలు వారికి అనుకూలమైన వారిని పెట్టుకుని పేరెంట్స్‌ కమిటీల సమావేశాలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి.
ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లల్లో కానరాని నిబంధనలు
ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, స్కూల్‌ డ్రెస్‌లను పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు కొన్ని తరగతులకే అనుమతులు తీసుకుని అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు.10వ తరగతిలో వేరే పాఠశాలల పేరు మీద అనుమతులు తీసుకోవడం గాని ప్రైవేట్‌ క్యాండెట్‌గా పరీక్షలు రాయించడం లాంటివి చేస్తున్నారు. ఇదంతా విద్యాశాఖధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహరంలో ప్రతి సంవత్సరం భారీగానే చేతులు మారుతున్నాయి. నగరంలో పలు చోట్ల ప్రైవేట్‌ విద్యాసంస్థలు నిర్వాహకులు గుర్తింపు లేకుండానే పాఠశాలల నిర్వహణ చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫీజులు భారీగా పెంచారు...
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు భారీగా పెంచారు. స్కూలు అవసరాలకు ఖర్చులు పెరిగాయని 30 శాతం వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. ఒకటో తరగతికి రూ.20 వేలు చెల్లించాలని కోరారు. బుక్స్‌, డ్రెస్‌లకు అధనం. ఇద్దరు పిల్లలకు గతేడాది కంటే 30 శాతం అధి కంగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఫీజులు ఇలా పెంచితే చదివించే పరిస్థితి లేదు. అధికారులు పర్యవేక్షణ పెరగాలి. ఫీజుల నియంత్రణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి.
- కెఎస్‌.వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం ఆర్యాపురం
పాఠశాలల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను సోమవారం నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. వేసవి తీవ్రత దృష్ట్యా వారం రోజుల పాటు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఒంటిపూట మాత్రమే తరగతులు జరుగుతాయి. మధ్యాహ్న భోజనం తరువాత పిల్లలను పంపిస్తారు. జెవికె కిట్లను ప్రారంభం రోజే అందిస్తాం. రాజమండ్రిలో కంటిపూడి రామారావు ఉన్నత పాఠశాలలో ఎంపీ భరత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అన్ని పాఠశాలలకు మూడు రోజుల క్రితమే జెవికె కిట్లను సరఫరా చేశాం.
- బి.దిలీప్‌కుమార్‌, అర్బన్‌ రేంజ్‌ డిఐ, రాజమహేంద్రవరం