Mar 26,2023 23:18

నివాళులర్పిస్తున్న ఎంఎల్‌సి సాబ్జీ తదితరులు

పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎంతో మంది ఉపాధ్యాయ నేతల త్యాగాల ఫలితంగా ఐక్య ఉపాధ్యాయ సంఘం(యుటిఎఫ్‌) ఏర్పడిందని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ పేర్కొన్నారు. యుటిఎఫ్‌ ఉద్యమ నిర్మాతలు అప్పారి వెంకటస్వామి, వత్సవాయి సూర్యనారాయణ రాజు వర్థంతిని ఆదివారం విటి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, ఎ.షరీఫ్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంఎల్‌సి సాబ్జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పారి, సూర్యనారాయణరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యమ నాయకులు తమ జీతాలు, జీవితాలు సైతం పణంగా పెట్టి ఉపాధ్యాయ హక్కులు సాధించారన్నారు. హక్కులను పరిరక్షించుకోవడానికి ఉపాధ్యాయులంతా చైతన్యంతో ఉద్యమాలకు, పోరాటానికి సంసిద్ధులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో ప్రాథమిక విద్యా వ్యవస్థ పేదలకు దూరమవుతోందని ఆయన పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలోని జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘ ఆలిండియా కార్యదర్శి పి.సతీష్‌ మాట్లాడుతూ ప్రశ్నించిన గొంతులకు ఇనుప సంకెళ్లు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల శ్రమను కొందరు కార్పొరేట్లు ప్రభుత్వ పెద్దల సహకారంతో సునాయాసంగా దోచేస్తున్నారన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక ధోరణుల్ని తిప్పికొట్టాలన్నారు. ప్రధాన కార్యదర్శి షరీఫ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు యుటిఎఫ్‌ చేపట్టిన ఉద్యమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ సాంస్కతిక దళం ఆలపించిన ఉద్యమ గీతాలు అందర్నీ ఆలోచింపజేశాయి. యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి ప్రసాద్‌, జిల్లా అసోసియేట్లు ఎం విజయ గౌరీ, ఐ రాంబాబు తదితరు పాల్గొన్నారు.