ప్రజాశక్తి - ఉండ్రాజవరం: గ్రామాలలో రోడ్లపక్క ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపుతో మండలంలోని గ్రామాల ప్రజలు హమ్మయ్య అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న నాయకుల విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. దీంతోపాటు వివిధ పార్టీల రాజకీయ నాయకుల, అభిమానుల ఫోటోలతో రోడ్ల కిరువైపులా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించేసారు. చిన్నచిన్న గ్రామాలలో సైతం చిన్న సైజు నుండి పెద్ద సైజు ఫ్లెక్సీలు కనీసం వంద నుండి 200 వరకు ఏర్పాటుచేసి ఉన్నాయి. ప్లాస్టిక్ ఫ్లెక్సీల వల్ల వాతావరణం కలుషితం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్లాస్టిక్ ను నిషేధించాలని ఆజ్ఞలు కూడా జారీ చేస్తున్నప్పటికీ, అంతకంతకు ఫ్లెక్సీల ఏర్పాటు ఎక్కువ అవుతుందే గాని తగ్గడం లేదు. పూర్వం ఎన్నికల సమయంలో కేవలం నాయకుల విగ్రహాలకు మాత్రమే ముసుగులు వేసేవారు, ఫ్లెక్సీల శకం మొదలైన తర్వాత గల్లీ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ నాయకుల, అభిమానుల ఫోటోలతో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. చిన్నచిన్న సందులలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎన్నికల సమయంలో అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏ సందులో మరిచిపోయామా, ఎక్కడ తీయాల్సినవి ఉన్నాయా అనే సమస్యతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేవలం ఖాళీ ప్రదేశాలలో కాకుండా, ఇళ్ళ ముందర, రోడ్ల కూడళ్ళలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు రోడ్లు కనిపించక ప్రమాదాలకు గురయ్యేవారు.










