Mar 06,2023 22:35

ప్రజాశక్తి-ఉండ్రాజవరం పంట కాలువలను, మురుగు డ్రైన్లను పరిరక్షించాల్సిన అధికారులే, చెత్తా చెదరాలతో వాటిని పూడ్చి వేయడం దారుణమంటూ ఆ ప్రాంత రైతులు ఆవేదనతో జిల్లా కలెక్టర్‌కు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. మండలంలో మోర్త నుంచి చివటం వరకు ఉన్న పంట పొలాల మురుగు నీరు ప్రవహించే గోస్తనీ నదిని మోర్త డ్రైన్‌గా పిలుస్తారు. సుమారు 1000 ఎకరాలకు పైగా పంట పొలాల మురుగునీరు ఈ డ్రైన్‌ ద్వారా ప్రవహించి, చివటం వద్ద ప్రధాన కాలువలో కలుస్తుంది. ఈ డ్రైన్‌ పూడికతీత కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు రూ.లక్షల వ్యయం ఖర్చు చేస్తూనే ఉంది. 2020-21లో రూ.23 లక్షలతో ఈ డ్రైన్‌ పూడికతీత పనులు జరిగాయి. ఒకవైపు రూ.లక్షల వ్యయంతో డ్రైన్స్‌ అధికారులు పూడిక తీయిస్తుంటే, మరోవైపు పంచాయతీ అధికారులు, గ్రామంలో సేకరించిన చెత్తతో డ్రైన్లను పూడ్చి వేయడం సబబేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రమైన ఉండ్రాజవరం నుంచి తాడిపర్రు వెళ్లే రహదారి వెంబడి పంచాయతీ సిబ్బంది చెత్తను డంప్‌ చేస్తారు. సాయంత్రం చీకటి పడగానే ఆ చెత్తకు నిప్పంటిస్తారు. సగం కాలిపోగా మిగిలిన చెత్తను యంత్రాల సాయంతో మోర్త డ్రైన్‌లోకి నెట్టి వేస్తారు. ఈ తతంగం మొత్తం రోజువారీ కార్యక్రమంలా గ్రామ పంచాయితీ అధికారుల సమక్షంలోనే జరగడం చూస్తుంటే పారిశుధ్యంపై వారికున్న ప్రత్యేక శ్రద్దకు అద్దం పడుతున్నట్లు ఉంది. చెత్తకు పెట్టే నిప్పు వల్ల వచ్చే పొగతో అటుగా వెళ్లే ప్రయాణికులు, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. ఈ విషయమై అనేకమార్లు పంచాయతీ అధికారులకు మొర పెట్టుకుంటున్నప్పటికీ, వారు పట్టించుకోకుపోవడంతో స్థానికులు నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఇళ్ల మధ్యలో చెత్తను వెయ్యడం, దానికి నిప్పటించడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు, చెత్తను కాలువలో వేయడం వల్ల పూడిపోతున్న కాలువను పరిరక్షించాలని సుమారు 80 మంది బాధితులు, రైతులు మూడు ఫిర్యాదుల్లో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.