ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
మున్సిపల్ టీచర్స్‌కు సంబంధించి సర్వీస్ రూల్స్‌లో లోపాలను సవరించాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మున్సిపల్ టీచర్స్ సబ్ కమిటీ సమావేశం యుటిఎఫ్ హోమ్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్‌గా బదిలీలు, ఉద్యోగోన్నతలు చేపట్టేందుకు సర్వీసు నిబంధనల ముసాయిదాను వెబ్‌సైట్‌లో పెట్టారన్నారు. దీనిపై అభ్యంతరాలను ఆహ్వానించారన్నారు. ఇప్పటివరకూ విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలకు వేర్వేరుగా.. ఆయా జిల్లాల్లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు విడివిడిగా బదిలీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా చేసేందుకు ముసాయిదా తీసుకొచ్చారని తెలిపారు. ఇది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా, పాత జిల్లా జిల్లాల ప్రకారం ఉంటుందా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. కన్వీనర్ జెవివి.సుబ్బారావు మాట్లాడుతూ కొత్త నిబంధనను పురపాలక ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. దీని వల్ల సర్వీసు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి ఎన్. రవిబాబు మాట్లాడుతూ జిల్లా యూనిట్ నిబంధనల అమలు కంటే ముందే బదిలీలు, ఉద్యోన్నతులు చేపట్టాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు, ఉద్యోగోన్నతలు నిర్వహించాలన్నారు. అర్బన్ ఎంఇఒ, అర్బన్ డివైఇఒ క్యాడర్‌లు సర్వీస్ రూల్స్‌లో పొందుపరచాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలని, జిల్లా పరిషత్‌లో మాదిరిగా ఎంఎ తెలుగు అర్హత ఉన్న ఎస్‌జిటిలకు స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతలి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్‌జిటి అర్హతల్లో డిఎడ్‌తో పాటు, బిఎడ్‌ను చేర్చాలన్నారు. సెలవు నిబంధనలు, సెలవు గ్రాంట్ చేసే అధికారాలు సమగ్రంగా రూపొందించాలన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అందుతున్న అనేక ఇతర సౌకర్యాలు మున్సిపల్ ఉపాధ్యాయులకూ అందేలా సర్వీస్ రూల్స్‌లో మార్పు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.










