ప్రజాశక్తి - సీతానగరం మునికూడలిలో జెపి సంస్థ ఆర్కే పేరును నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులో గనుల శాఖ ఇడి విష్ణువర్ధనరావు, ఎస్‌ఇబి ఎఎస్‌పి సోమశేఖర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జెపి సంస్థకు చెందిన సిబ్బంది వారు నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు నుంచి లోడింగ్ చేసే భారీ యంత్రాలను రహస్య స్థలానికి తీసుకుని పోయి దాచివేశారు. పక్కనే నూతనంగా రాజమహేంద్రవరానికి చెందిన దొరబాబు, విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం తాళ్లపూడి మండలం ప్రక్కిలంకకు చెందిన భూముల్లో ఇసుకను యంత్రాల సాయంతో లారీలకు లోడ్ చేసి బిల్లులు ఇచ్చి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. తమకు హోమ్ మంత్రి పిఎ సాయంతో జెపి సంస్థ నుంచి ప్రక్కిలంక భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారని వారు వాదనకు దిగారు. జెపి సంస్థకు చెందిన సిబ్బంది రాష్ట్రం మొత్తం మీద 2023 మే 13 వరకు రాష్ట్రంలో ఉన్న ఇసుకను అమ్మేందుకు అనుమతి ఉందని అంటున్నారు. ఈ విషయమై సర్వే చేసిన అధికారులు సంబంధిత భూములు తాళ్లపూడి మండలం ప్రక్కిలలంకకు చెందిన ప్రభుత్వ భూములని నిర్ధారించారు. దీనిపై తగు చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.










