May 29,2023 22:19

నర్సరీని పరిశీలిస్తున్న డ్వామా పీడీ

ప్రజాశక్తి -గోకవరం
ఎంపీడీఒ కార్యాలయం వద్ద ఉన్న మునగ నర్సరీని సోమవారం ఉపాధి హామీ పథకం ఎపిఒ పిఎస్‌.అప్పలరాజు ఆధ్వర్యంలో డ్వామా పీడీ జిఎస్‌.రామ్‌గోపాల్‌ పరిశీలించారు. తొలుత ఆయన స్పందనలో పాల్గొన్నారు. అనంతరం ఎంపిడిఒ కార్యాలయం వద్ద రూ.29 వేలతో చేపట్టిన మునగ నర్సరీని పరిశీలించారు. జిల్లాలో 18 మండలాల్లో 73 వేల మంది వేతనాదారులకు పనులు కల్పించామన్నారు. గోకవరం మండలంలో 7వేల మంది వివిధ రకాల పనులు చేస్తున్నారని తెలిపారు 2023-24లో జిల్లాకు 53 లక్షల పని దినాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్‌ నెలాఖరు నాటికి 60 శాతం పనిదినాల కల్పన పూర్తయ్యిందన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలో 75 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికీ 50 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. మిగిలిన 25 చెరువులు జూన్‌ మొదటి వారం నాటికి పూర్తి చేస్తామన్నారు అమత్‌ సరోవర్‌ పనుల్లో భాగంగా చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, స్లయిస్‌ రిపైర్‌ వంటి పనులు నిమిత్తం రూ.2 లక్షల మంజూరు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 200 ఎకరాలు మునగ, 300 ఎకరాల్లో పండ్ల తోటలు పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాకాలంలో ఉపాధి కూలీలకు పనులు కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మునగ నర్సరిలో పెంచిన మొక్కలను డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి 2మొక్కలు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కెవిఎస్‌ఎస్‌ఎస్‌.మూర్తి, తహశీల్దార్‌ ఎ.శ్రీనివాసు పాల్గొన్నారు.