ప్రజాశక్తి - సీతానగరం ప్రభుత్వం అందించిన పేదలందరికీ ఇళ్ళ స్థలాల పంపిణీపై న్యాయవాది, సామాజిక ఉద్యమకారుడు చిడిపి నకుల సురేష్ స్పందన కార్యక్రమంలో ఎంపిడిఒ రమేష్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సురేష్ విలేకరులతో మాట్లాడుతూ స్థలాలు నివాసయోగ్యమో కాదో అని పరిశీలించకుండానే ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాధికారులు భూములను కొనుగోలు చేశారని చెప్పారు. మండలంలోని చినకొండేపూడి, కాటవరం, కూనవరం, ముగ్గళ్ల, ములకల్లంక, నాగంపల్లి, నల్లగొండ, రఘుదేవపురం, సింగవరం వంగలపూడి గ్రామాలు ఏటా వరదముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ముంపు ప్రాంతాలుగా గుర్తిస్తూ 2021 జులైలో ఇస్రో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదకలను అందజేసింది. వరద ముంపు ప్రాంతాలకు గురయ్యే గ్రామాల నుంచి ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు తమకు ఈ నివాసస్థలాలు అవసరం లేదని తిరస్కరించారన్నారు. ముంపు ప్రాంతాలలో పేదలకు ఇళ్లు నిర్మించడం ఏటా సంభవించే వరదలతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాక, అనేక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. అంతేకాక వరద ముంపు ప్రాంతాల్లో నివాసాలను ఏర్పరచుకోవడం వల్ల ముంపు తీవ్రమవడమే కాక, చుట్టుప్రక్కల గ్రామాలు కూడా ముంపునకు గురయ్యే అవకాశాలు న్నాన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, అమలు చేసిన తరువాత మాత్రమే ఆ స్థలాలలో ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.










