Jan 26,2023 23:41

సమావేశంలో పాల్గొన్న రాజులోవ, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - బిక్కవోలు
ముఖ హాజరును రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ డిమాండ్‌ చేశారు. గురువారం బిక్కవోలులో సిఐటియు మండల అధ్యక్షులు బి.మార్త అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ముఖ హాజరును ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఇది అమల్లో ఉందన్నారు. ఈ విధానంలో అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించకుండానే, స్కీమ్‌ వర్కర్లు, చిరు ఉద్యోగులకు ముఖ హాజరు పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటన్నారు. బయోమెట్రిక్‌ విధానంలోనే అనేక సాంకేతిక సమస్యలు వచ్చాయని వాటిని సైతం పరిష్కరించలేని ప్రభుత్వం, ముఖ హాజరులో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరిస్తుందని ప్రశ్నించారు. అరకొర జీతాలతో కాలం వెలదీస్తున్న చిరు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే కొత్త విధానాలతో మరింత నష్టపోతారన్నారు. క్షేత్రస్థాయిలో వచ్చే ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ హాజరును విరమించుకోవాలని కోరారు. కింది స్థాయిలో స్కీం వర్కర్లు, మున్సిపల్‌ కార్మికులు వంటి వారు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తాననే హామీని అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి టికె.వెంకటేశ్వరరావు, నాయకులు రాజకుమారి, పి.లక్ష్మి, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.