ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్ధి సంగ్రామ సైకిల్ యాత్ర గురువారం ముగిసింది. సైకిళ్లకు సంగ్రామ యాత్ర జెండాలను అలంకరించి ప్రతి పాఠశాలలో బృందం పర్యటించి విద్యార్థులను పలకరించింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు ఫలితంగా ఎదురౌతున్న ఇబ్బందులను విద్యార్థులకు వివరించింది.ఈ నెల 21న రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించిన విషయం విదితమే. ఈకార్యక్రమానికి పిడిఎఫ్‌ఐ ఎంఎల్‌సి ఇళ్ల వెకంటేశ్వరరావు ముఖ్య అథిధిగా పాల్గొని ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కుతూ వెళ్లి కొన్ని పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంగ్రామ యాత్రలో భాగంగా పలు డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి ఎస్‌ఎఫ్‌ఐ తీసుకెళ్లింది. సుమారు 22 డిమాండ్‌లతో యాత్ర ముందుకు సాగింది. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలోని 40 విద్యా సంస్థలలను ఎస్‌ఎఫ్‌ఐ బృందం సందర్శించింది.
అనేక సమస్యలు వెలుగులోకి
సైకిల్ సంగ్రామ యాత్ర సందర్భంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌పరిధిలోని కొన్ని విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తదితర పథకాల పేర్లతో రూ.కోట్ల ఖర్చుల చేస్తున్నామని, నాడు-నేడు పనులకు రూపురేఖలు మార్చేశామని చేస్తున్న ప్రకటనల గురించి తెలిసిందే. వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గణేష్ చౌక్‌లోని గర్ల్ హాస్టల్ నూతన భవనం నిర్మాణం కోసం 2018లో శంకుస్థాపన చేసి నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఒకొక్క హాస్టల్ గదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు బస చేయాల్సి వస్తోంది.కందుకూరి రాజ్యలక్ష్మి విద్యా సంస్థల సమీపంలోని వుమెన్స్ హాస్టల్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా విద్యార్ధుల సంఖ్యకు తగ్గట్లుగా గదులు లేవు. రాష్ట్రంలోనే ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటైన ఆర్ట్స్ కాలేజీలో పెరిగిన విద్యార్ధుల సంఖ్యకు తగినంతగా తరగతి గదులు లేకపోవటతో ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల వారీగా కళాశాల నిర్వహిస్తున్న విషయం విధితమే.దీంతో రంగంపేట, సీతానగరం తదితర మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాఠశాలల్లోనూ తప్పని వెతలు
పాఠశాలల్లోనూ అనేక సమస్యలు తిష్ట వేశాయి. నాడు -నేడు పనులు నత్త నడకన సాగుతున్నాయి. ప్రతి స్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేసే వారి సంఖ్య 30 శాతం లోపుమాత్రమేనని తెలుస్తోంది. ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్న భోజనం నిర్వహణ అప్పజెప్పటతో సదరు నిర్వహకులు ఉదయం 9 గంటలకే భోజనం స్కూళ్లకు తీసుకొస్తున్నారు. మధ్యాహ్నానికి భోజనం నాణ్యత తగ్గిపోతోంది. మరో వైపు బియ్యం లావుగా ఉండటంతో విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనం చేయటం లేదా క్యారేజీలు తెచ్చుకోవటం పరిపాటిగా మారింది. హాస్టల్స్‌లో పర్మినెంట్ క్లర్క్‌లు లేకపోవటంతో నిర్వహణ భారమవుతోందని తెలిసింది. అదే విధంగా రాజమహేంద్రవరంలో ఒకటే ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరో మహిళా కళాశాల ఉండటతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అదే విధంగా పాఠ్యపుస్తకాలు అందజేయకపోవటంతో విద్యార్థుల పరీక్షల ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇలా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ఘనంగా ముగింపు సభ
ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ సంగ్రామ యాత్ర ముగింపు సభ గురువారం కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి షేక్ సాబ్జీ ముఖ్య అతిధిగా హాజరై విద్యా రంగంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన సైకిల్ యాత్రను అభినందించారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం కేటాయిస్తేనే సమస్యలు పరిష్కార మార్గమని ఆ దిశగా పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్ధి ఉద్యమాలకు పిడిఎఫ్ ఎంఎల్‌సిలుగా సంపూర్ణ మద్దతు ఇస్తామని అవసరమైనే నిరవధిక నిరాహార దీక్షకు సైతం దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో 40 విద్యాసంస్థలలో ఎస్‌ఎఫ్‌ఐ బృందం పర్యటించిందని అన్నారు. పాఠశాలల్లో ఆటస్థలాలు ఏర్పాటు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బి.రాంబాబు, నాయకులు మహేష్, యూసఫ్, జ్యోతిర్మయి, దుర్గ, వైష్ణవి, మరియ, వెంకటలక్ష్మి, స్వేచ్ఛ, బాషా, షఫి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శులు బి.పవన్, రాజులోవ తదితరులు పాల్గొన్నారు.










