ప్రజాశక్తి-కోరుకొండ స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో మూడు తాటాకుపాకలు దగ్ధమయ్యాయి. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం నర్సాపురం రోడ్డు కూడలి వద్ద నున్న తాటాకుపాకల వెనుక ఉన్న డ్రైనేజీలో ఉన్న చెత్తలో మంటలు చెలరేగాయి. స్థానికులు బకెట్లు, బిందెలతో నీళ్లు తెచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు తాటాకు పాకలకు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు వ్యాపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమీప గుమ్మళ్ళదొడ్డి హెచ్‌పిసిఎల్ సంస్థ నుంచి, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ మూడు పాకల్లో మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వీరందరూ జంబూపట్నం గ్రామానికి చెందినవారు. తమ జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు.










