Aug 09,2023 23:16

పోస్టాఫీసు వద్ద నిరసన తెలుపుతున్న కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు

కేంద్ర కార్మిక సంఘాల నాయకులు
హెడ్‌ పోస్టాఫీసు వద్ద మహా ధర్నా
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
మోదీని గద్దె దింపుదాం... దేశాన్ని రక్షించుకుందాం అంటూ పలు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, మణిపూర్‌, హర్యానా రాష్ట్రాల్లో హింసను అరికట్టి బాధితులను ఆదుకోవాలని, కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్లతో కేంద్రకార్మిక సంఘాలు, రైతు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్‌ వద్ద గల హెడ్‌ పోస్టఫీస్‌ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నానుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఎఐటియుసి జిల్లా కన్వీనర్‌ కె.రాంబాబు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కె.జోజి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు వెంకటసుబ్బయ్య, ఎకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు జె.సత్తిబాబు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి, ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘం సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షులు పి.సతీష్‌ తదితరులు మాట్లాడారు.
మోడీ ప్రభుత్వానికి 2016లో 13 కేంద్ర కార్మికసంఘాలు పలు డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చారన్నారు. ఏడేళ్లలో మోడీ ప్రభుత్వం ఒక్క డిమాండ్‌ను కూడా నెరవేర్చలేదన్నారు. దీంతో క్విట్‌ ఇండియా స్పూర్తితో ఆగస్ట్‌ 9 జైల్‌ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకపోయినా, ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పి మాట మార్చిందన్నారు. పరిశ్రమలు రాకుండా చేసినా, పోలవరం నిధులు ఇవ్వకుండా, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. జిఎస్‌టి నిధులు విడుదల సందర్భంగా స్థానిక సంస్థల్లో పన్నులు పెంచాలని కండీషన్లు పెడుతున్నా, ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నా, అదానికి అనుకూలంగా రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే 2020 విద్యుత్‌ చట్టం తెచ్చి రైతాంగానికి ఉచిత కరెంటుకు మంగళం పాడుతున్నా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కుదరదని చెప్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డికి ఏమాత్రం పట్టడంలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజల, కార్మికుల, రైతాంగ సమస్యలకు కారణమవుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే జగన్‌ ప్రభుత్వం భుజాలు తడుముకుంటూ ముందస్తు అరెస్టులు చేస్తుందన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, మోడీ విధానాలనే జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తుందన్నారు. షెడ్యూల్‌ పరిశ్రమల్లో కార్మికుల వేతనాలు 15 ఏళ్ల నుంచి సవరించకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టంతో పోగేసుకున్న 2వేల కోట్లు వాడేసుకుని, కార్మికులకు ఇచ్చే సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో మోడీ, జగన్‌ ప్రభుత్వాలు దీనికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్మికులు, ఉద్యోగులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఎల్‌ఐసి నుంచి రాజమండ్రి డివిజన్‌ కార్యదర్శి కోదండరాం, ఇపిఎఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.మోహన్‌రావు, కెవిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు వి.కొండలరావు, బి.పవన్‌, సిపిఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎవి.రమణ, ఎఐటియుసి సీనియర్‌ నాయకులు నల్లా రామారావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.అన్నామణి, రైతు సంఘం నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌, పిడిఎస్‌యు జిల్లా కోశాధికారి కె.భానుప్రసాద్‌, శ్రామిక మహిళలు, విద్యార్థి సంఘాల నాయకులు, జట్లు లేబర్‌ యూనియన్‌, పెన్షనర్స్‌, ఐద్వా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు పాల్గొన్నారు
నిడదవోలు : క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కుల వివక్ష పోవాలని, మతోన్మాదం నశించాలంటూ కెవిపిఎస్‌ఆధ్వర్యంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద 'కుల ఉన్మాదం..మతోన్మాదం' దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, ఆచారాలు కలిగి భిన్నత్వంలో ఏకత్వంగా లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా దేశం అవతరించిందన్నారు. ఇలాంటి దేశంలో తొమ్మెదేళ్లుగా కేంద్రంలోని బిజెపి సర్కారు, ఆర్‌ఎస్‌ఎస్‌ మూఖలు, మతోన్మాద శక్తులు మత ఘర్షణలను సృష్టిస్తున్నాయన్నారు. మనువాద పాలనకు ఆజ్యం పోస్తున్నారన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ఘటన ఇందులో భాగమేనన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నోరు మెదపట్లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి, మతోన్మాద శక్తులను ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాసరావు, జి.డానియేల్‌, గారపాటి ప్రసన్నకృష్ణ, యర్రా శ్రీనివాస్‌, రసూల్‌, ఉస్మాన్‌, టి.నాని, సర్వేశ్వరరావు, టి.సుధాకర్‌, టి.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు