Mar 02,2023 22:01

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్‌, నిడదవోలు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పిలుపు ఇచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం గహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50, వాణిజ్య సిలెండర్‌ రూ.350 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం శ్యామల సెంటర్‌లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌ మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వ ధరల పెరుగుదలను నిలదీస్తారా లొంగిపోతారా అని ప్రశ్నించారు. గ్యాస్‌ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని గ్యాస్‌ ధరలు రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పెంచడం దారుణమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.417 ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలెండర్‌ ధర నేడు రూ.1,155కు పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వం సబ్సిడీ జమలు రెండు సంవత్సరాల నుండి నిలిపివేసిదని, ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ కింద ఇచ్చే సిలెండర్ల సంఖ్య కుదించారన్నారు. ఇది పూర్తిగా పేద, మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదన్నారు. వాణిజ్య సిలెండరు ఒక్కసారిగా రూ.350 పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఆర్థిక మాంద్యం వల్ల చితికిపోతున్న స్వయం ఉపాధి మరింత దుర్భరస్థితికి చేరుకుంటుందని, ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి బి.పవన్‌, నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌.మూర్తి, జరీనా, కర్రి రామకష్ణ, పడాల రామకష్ణ, తులసి, పూర్ణిమరాజ్‌, రాము, సోమేశ్వరరావు, కోటేశ్వరరావు, ఉమ, కష్ణ, రాజా, రాంబాబు పాల్గొన్నారు.
కొవ్వూరులో చేపట్టిన నిరసనలో సిపిఎం నాయకులు డి.రాధాకృష్ణ, పడాల గంగాధరరావు మాట్లాడుతూ మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ ప్రభుత్వం విపరీతంగా వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మకానికి పెట్టి దేశద్రోహం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వీరబాబు, పండు, మీరాసాహెబ్‌, ఈశ్వరరావు పాల్గొన్నారు.
నిడదవోలు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు రాంబాబు మాట్లాడారు. పి.నాగరాజు, ఎం.రాము, నల్లా దుర్గా ప్రసాద్‌, దాకే సతీష్‌, బాబ్జీ, ప్రవీణ్‌, దీపు పాల్గొన్నారు.