స్క్రీనింగ్‌కే పరిమితమవుతున్న సేవలు
అరకొరగానే శస్త్ర చికిత్సలు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
అధికారంలోకొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఎంతో గొప్పగా జిల్లాలో ప్రారంభించిన కంటివెలుగు పథకం మసకబారుతోంది. మూడేళ్లు దాటినా పథకం ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 60 ఏళ్లు పైబడిన 2,07,839 మందికి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. అనంతరం విద్యార్థులతో పాటు అవ్వాతాతలకు పరీక్షలు చేయడానికి అడుగులు వేశారు. ఇందులో జిల్లాలో 1,50,220 అంటే 72.28 శాతం మందికి మాత్రమే పరీక్షలు చేశారు. వీరిలో 63,949 మందికి కళ్ల అద్దాలు అందించాలని నిర్ణయించారు. కాని 43,213 మందికి మాత్రమే కళ్ల అద్దాలు అందించారు. కంటిలో శుక్లాల పరీక్షలకు 3,621 మందికి రిఫర్ చేయగా 2,217 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో వందలాది మంది అవ్వాతాతలు, పిల్లలు కంటి అద్దాల కోసం ఎదురు చూస్తున్నారు
ఎన్‌జిలకు చెల్లింపులు నిలిపివేత
జిల్లాలో కంటి వెలుగు కింద ఎన్‌జిలకు, ఆరోగ్యశ్రీ పథకంలోను ఆపరేషన్లు చేయడానికి అవకాశం కల్పించారు. వేమగిరిలోని పరమహంస, జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు పలు ప్రయివేటు ఆసుపత్రుల సైతం ఆపరేషన్లు చేశాయి. వీరు కూడా ప్రతి సంస్థ నుంచి వందల్లోనే ఆపరేషన్లు చేశారు. ఒక్కో ఆపరేషనకు సుమారు రూ.2వేలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు పైసా చెల్లించలేదు. అయినా ఇంకా ఆ సంస్థలు మానవత్వంతో అవ్వాతాతలకు ఆపరేషన చేస్తున్నట్లు చెబుతున్నారు.
జీతాలకు ఎసరు...
కంటి వెలుగు పథకం నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంది. కంటి పరీక్షలు నిర్వహణకు ఒక్కో ప్రాంతానికి ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 20 మందిని నియమించుకున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.15వేలు వేతనం చెల్లించాల్సి ఉంది. కాని వేతనాలే ఇవ్వకపోవడంతో వారు వదిలిపెట్టి వెళ్లిపోయారని ఆయా వర్గాలు ద్వారా తెలుస్తోంది. కోవిడ్ నెపంతో జీతాలకు ఎసరు పెట్టడంతో ఆ సిబ్బంది ఆవేదనతో వెళ్లిపోయారని చెబుతున్నారు.
శస్త్ర చికిత్సలు చేస్తున్నాం...
కంటి వెలుగు ద్వారా శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. కొవిడ్ వల్ల రెండేళ్లు స్క్రీనింగ్, ఆపరేషన్లు చేయలేకపోయాం. జిల్లాలో 72 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. కళ్ల అద్దాలను అందించాం. ఇంకా కొందరికి కంటి అద్దాలు రావాలి. ఉన్నత అధికారులకు తెలిపాం. త్వరలోనే అందిస్తాం.
- డాక్టర్ లావణ్య అంధత్వ నివారణాధికారి










