Feb 06,2023 22:37

ప్రజాశక్తి-ధవళేశ్వరం తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నాలుగు గంటలపాటు మండుటెండలో మహా ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లాలోని అన్ని మండలాల నుంచీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పెద్దఎత్తున తరలి వచ్చి మహాధర్నాలో పాల్గొన్నారు. సమస్యలు తెలిపేందుకు ఎంత సేపటికీ ఒక్క అధికారికూడా రానందున తామే అధికారుల వద్దకు వెళతామని చెప్పడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లను తోసి కలెక్టరెట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్‌వాడీల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్‌ 10 మంది ప్రతినిధి బృందంతో చర్చలకు ఆహ్వానించారు. యూనియన్‌ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. తొలుత మహా ధర్నాలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌.మాణిక్యంబ, కార్యదర్శి కె.బేబిరాణి, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే అదనంగా రూ.వెయ్యి చెల్లిస్తానని చెప్పి, నేడు తెలంగాణ రాష్ట్రం కంటే రూ.2000 తక్కువ వేతనాలు చెల్లిస్తూ మాట తప్పారన్నారు. కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు అంగన్‌వాడీ గ్రాడ్యుటీ అమలు చేస్తూ జిఒ ఇచ్చిందని, జగన్‌ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫుడ్‌ కమిషనర్‌ ప్రతాప్‌ రెడ్డి చిరుద్యోగులను అవమానపరిస్తూ మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. చేతనైతే అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు పెట్టే మెనూ ఛార్జి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్‌ పెడితే సెంటర్లను ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. కనీసం నెలనెలా వేతనాలు కూడా చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ ధరలను రోజురోజుకీ పెంచుతూ నిత్యావస సరుకుల ధరలను విపరీతంగా పెంచుతుందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల పిల్లలకు పౌష్టికాహారం అందించే ఐసిడిస్‌కు బడ్జెట్‌లో నిధులు తగ్గించి పేద పిల్లలకు అన్యాయం చేశారని, గర్భిణులు, పిల్లలు తినగలిగేలా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పేదలకు సేవచేసే అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫేస్‌ యాప్‌ రద్దు చేసేంతవరకు ఈ ఆందోళన కొన సాగిస్తామని హెచ్చరిం చారు. చేసే పని ఒకేలా ఉన్నా మినీ వర్కర్‌ అనే పేరుతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నారని, తక్షణమే మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించాలన్నారు. రాజకీయ వేధింపులతో తొలగించిన వారిని విధులలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం దశాలవారీ పోరాటాలకు అంగన్‌వాడీలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎం.వెంకటలక్ష్మి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, భగత్‌, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి భాగ్యలక్ష్మి, ఆఫీస్‌ బేరర్స్‌ అన్నపూర్ణ, మత్తమ్మ, సూర్యకాంతం, రామలక్ష్మి, వై.సుజాత, సుబ్బలక్ష్మి, శారద, కల్యాణి, ఎం.మార్తమ్మ, మాలతి, దుర్గాంబ, మేరీ, లక్ష్మి అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొన్నారు.