ప్రజాశక్తి - చాగల్లు
మహిళల అభివృద్ధే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లులోని 3వ విడత వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వనిత, ఎంపీ భరత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండలంలోని 1,235 మహిళా సంఘాల సభ్యులకు నమూనా చెక్‌ను అందించారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల హోమ్ మంత్రుల్లో తాను ఒక్కరే మహిళా హోం మంత్రి అని తెలిపారు. ఇది జగన్ సర్కారు మహిళలకు ఇస్తున్న గౌరవం అన్నారు. మహిళలపై రక్షణ, భద్రత కోసం దిశ యాప్‌ను తీసుకొచ్చామన్నారు. డ్వాక్రా మహిళలకే కాకుండా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, కాపు, ఆర్థికంగా వెనుకబడిన కులాలందరికీ లబ్ధి చేకూర్చేలా పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మట్టా వీరస్వామి, వైసిపి మండల అధ్యక్షులు డాక్టర్ చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, నాయకులు టి.దామోదరావు, జె.రామచంద్రరవు, సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి, ఎంపిడిఒ బి.రాంప్రసాద్, ఇన్‌ఛార్జి తహశీల్దార్ కె.నిరంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










