ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్, గోకవరం రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. శుక్రవారం కొవ్వూరు 5వ వార్డులో గడప గడపక మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి వనిత పాల్గొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని వనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడేళ్లలో పేదవారికి ప్రయోజనం జరిగిందని, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా ఇంటికే వచ్చి అర్హులకు పథకాలను వర్తింపజేస్తున్నారని మంత్రి తెలిపారు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు అమలు చేసి ప్రజల మనసులో ఉన్నారని మంత్రి తెలిపారు. పేదల ఇంటి కల నెరవేర్చే దిశగా, రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థలా పట్టాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తున్నట్టు చెప్పారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి కోడూరి శివరామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమారి, వైస్ చైర్మన్‌లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీదేవి, 5వ వార్డ్ కౌన్సిలర్ మద్దిపట్ల సాయి గీత, ఎఎంసి మాజీ చైర్మన్ బండి అబ్బులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతోందని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు అన్నారు. గోకవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చంటిబాబు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.










