May 29,2023 22:11

నిరసన తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు, మహిళలు, బాలికలు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
మహిళా రెజ్లర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాజమహేంద్రవరంలో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌శరణ్‌సింగ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, అరెస్టుచేయాలని, మహిళా రెజ్లర్లని విడుదల చేయాలని నినదించారు. ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బైపాస్‌ రోడ్‌, సినిమా సెంటర్లో ర్యాలీ చేపట్టారు. తొలుత డిఎంహెచ్‌ స్కూల్‌ నుంచి సినిమా సెంటర్‌ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం సినిమా సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీమణి, సిఐటియు జిల్లా కార్యదర్శి రాజులోవ మాట్లాడారు. భారత ఖ్యాతిని విదేశీ గడ్డపై చాటి చెప్పి దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టే విధంగా పథకాలు సాధిస్తున్న మహిళా రెజ్లర్లు తమపై బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చెయ్యాలని, రక్షణ కల్పించాలని దాదాపు 40 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ లో ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించడం తగదన్నారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభో త్సవం సందర్బంగా రెజలర్లు శాంతియుతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనపై, ప్రభుత్వం, పోలీసుల దమనఖండ, అక్రమ అరెస్టులను ప్రజలంతా ఖండించాలన్నారు. వారి న్యాయమైన పోరాటానికి మద్దతు పలకాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రేపిస్టులకు, దొంగలకు, కబ్జాదారులకు, అవినీతిపరులకు కొమ్ముగాస్తూ ప్రజలను గాలికొదిలేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రెజ్లర్లు పోరాటానికి మద్దతు లభిస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వీడి రెజ్లర్లకు తగిన న్యాయం చేయాలని, బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని, అరెస్ట్‌ చేసిన రెజ్లర్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు జరీనా, యుటిఎఫ్‌ నాయకులు అనిత, పార్వతి, శిరోమణి, లలిత, సిఐటియు నాయకులు, రాజులోవ, అరుణ్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, పూర్ణిమరాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పర్వేజ్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.