ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సమాజంలో మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం ఏర్పడుతుందని కలెక్టర్ కె.మాధవవీలత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మారథాన్ సైకిల్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు దైనందిన జీవితంలో భాగంగా సైక్లింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఇది ఏరోబిక్ వ్యాయామం కాబట్టి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుందన్నారు. గుండెకు ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని సరఫరా చేయడానికి సైక్లింగ్ ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ఇది వేగంగా పని చేస్తుందన్నారు. సైకిల్ తొక్కడం వల్ల రక్తనాళాలు, ఊపిరితిత్తులు కూడా బాగా పని చేస్తాయని చెప్పారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 1 నుచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ రికార్డ్ చేసి పిసిపిఎన్‌డిటి ఆంధ్ర ఈస్ట్ గోదావరి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తామన్నారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినన్ని అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం స్కానింగ్ సెంటర్‌లపై డెకారు ఆపరేషన్ నిర్వహిస్తామని, అందుకు సంబంధించి 22 మందితో కూడిన ప్రత్యేక వైద్య బందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఇంచార్జ్ డాక్టర్ సుధాకర్, ఐఎంఎ ప్రెసిడెంట్ డాక్టర్ గురు ప్రసాద్, డిఎన్‌ఎమ్‌ఒ డాక్టర్ లక్ష్మీదేవి, డాక్టర్ రాజీవ్, ఎంహెచ్‌ఒ డాక్టర్ వినూత్న, ఎంపిహెచ్‌ఒ నాగు పాల్గొన్నారు.










