ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. అనుమతి లేకుండా ఫార్మసీలు నిర్వహిస్తూ ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటోంది. అనుమతి ఉన్న మెడికల్ షాపుల్లో అర్హతలేని సిబ్బందిని నియమించి కొనసాగిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా సుమారు 220 మెడికల్ షాపులు ఉన్నట్లు సమాచారం. అనధికారికంగా మరో 100కి పైగా షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం షాపుల్లో ఒక నెలకు రూ.కోటికి పైగా విలువైన మందులను విక్రయాలు జరుగుతున్నాయి. అత్యధిక వ్యాపారం రాజమహేంద్రవరంలో జరుగుగోంది. చుట్టుపక్కల మండలాల నుంచి వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ఆస్పత్రులను ఆశ్రయించటం పరిపాటి. వైద్యుల సూచన అనంతరం మందులు ఇక్కడే కొనుగోలు చేసి వెళ్తుంటారు. అనుమతి లేకుండా షాపులు నిర్వహిస్తూ విక్రయించిన మందులకు సైతం బిల్లులు ఇవ్వకుండా ప్రజల జేబులకు చిల్లువేస్తున్నారు. కొన్నిచోట్ల డాక్టర్ల చీటి లేకుండానే మందులు అమ్ముతున్నారు.
అనధికార షాపులపై చర్యలేవీ..?
జిల్లావ్యాప్తంగా సుమారు 220 మెడికల్ షాపులకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు చాలా తేడాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 320 పైగా మెడికల్ షాపులు ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రాజమహేంద్రవరంలోనే 50 శాతం పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. చాలా మెడికల్ షాపుల్లో అర్హత గల సిబ్బంది లేరనేది బహిరంగ రహస్యమే. ఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన అర్హత గల వారి పేర్లపై షాపులకు అనుమతి తీసుకొని అర్హతలేని సిబ్బంది ద్వారా మందులను ప్రజలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారిక షాపుల్లో సైతం చాలా వరకు అర్హతలేని సిబ్బందే మందులు విక్రయిస్తున్నారు. ప్రధాన మెడిసిన్‌లకు సంబంధించి సిబ్బందికి ప్రజలకు ఎలా విక్రయించాలో ముందే చెబుతున్నారు. దీంతో ప్రజలు ఆ మందులు వేసుకుని అనారోగ్యానికి గురవుతున్నారు.
డాక్టర్ల మందుల చీటి లేకుండానే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం డాక్టర్ రాసిచ్చిన మందుల చీటటీ (మెడిసిన్ ప్రిస్కిప్షన్) ఆధారంగానే మందులను వినియోగదారునికి విక్రయించాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని కొన్ని మెడికల్ షాపుల్లో ఇష్టారీతిన మందుల విక్రయం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు రాసిన మందులను ఇవ్వాల్సింది పోయి తమకు తోచిన మందులను రోగులకు ఇస్తూ వారి జీవితాలతో కొందరు షాపుల నిర్వాహకులు ఆడుకుంటున్నారు. విక్రయించిన ప్రతి డ్రగ్‌కు బిల్లు ఇవ్వాల్సి ఉండగా లేకుండానే అమ్మేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు మందులు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. బిసి, సుగర్ వంటి వ్యాధులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు మందులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి అనధికార వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫార్మసీ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలపై వివరణ కోరేందుకు రాజమహేంద్రవరం డ్రగ్స్ విభాగం ఏడీని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.










