May 17,2023 23:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి మాత వందన యోజన కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. మాతాశిశు మరణాలు తగ్గించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి మాత వందన యోజన (పిఎంఎంవివై) అమలు చేస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, బిడ్డలకు పౌష్టికాహారం, టీకాలు, మందులకు అవసరమైన నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఉమ్మడి జిల్లాలో కాకినాడ రాజమహేంద్రవరం జిజిఎచ్‌లతోపాటు, 7 ఏరియా ఆస్పత్రులు, 27 సిహెచ్‌సిలు, 128 పిహెచ్‌సిలు ఉన్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రితో కలిపి ప్రతి నెలా జిల్లావ్యాప్తంగా సుమారు 40,000 కాన్పులు జరుగుతాయని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 16 వేల మంది ఈ పథకం లబ్ధి కోసం ఎదురుచూస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వేధిస్తున్న సాంకేతిక సమస్యలు
మహిళలకు వివాహమయ్యే వరకు పుట్టింటి పేరే ఉంటుంది. వివాహ అనంతరం పేరు మారుతుంది. అయితే ఆధార్‌ కార్డులోనూ పాత పేరే ఉండటంతో సమస్య ఎదురవుతోంది. కొందరు మనుగడలో లేని బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తున్నారు. ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం కావాలి. ఇకెవైసి పూర్తి కావాలి. ప్రసవానికి పుట్టింటికి వస్తారు. ఈ సమయంలో వివరాలు నమోదు కావడం లేదు. ఎఎన్‌ఎంలకు సమాచారం ఇవ్వకపోవడం, వారు అడిగిన వివరాలు పూర్తిగా సమర్పించకపోయినా సాయానికి దూరమవుతున్నారు. సుమారు 20 శాతం మందికి అసలు ఈ పథకం ఉన్నట్లే సమాచారం లేదు.
పథకం అమలు ఇలా
ప్రధానమంత్రి మాత వందన యోజన 2017 జనవరి 1 నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద గ్రామీణ గర్భిణులకు మొదటి కాన్పునకు రూ.6 వేలు, నగర వాసులకు రూ.5,600 ఇవ్వాలి. ఇప్పటి వరకు జిల్లాలో 1.10 లక్షల మందికి ఈ పథక ఫలాలు అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఆరు నెలలుగా ఎఎన్‌ఎంలు, పారా మెడికల్‌ సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు కోవిడ్‌ విధుల్లో తలమునకలై ఉండటంతో గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌ చేయలేదు. కొందరి వివరాలు ఆన్‌లైన్‌ చేసినా డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు.
విడతల వారీగా సాయం ఇలా..
గర్భం దాల్చిన 12 వారాల్లోగా పేరు నమోదు చేసుకుంటే రూ.1000 ఇస్తారు. అనంతరం 7 నెలల్లోగా టిటి రెండు డోసులు, 200 ఐరన్‌ మాత్రలు వేసుకోవడం పూర్తయితే రూ.2 వేలు అందిస్తారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవిస్తే రూ.600, గ్రామీణ మహిళలకు రూ.1,000 చొప్పున ఇస్తారు. అనంతరం పుట్టిన బిడ్డ జీరో డోసుతో మొదలుకొని నెలవారీ టీకాలు పెంటావాలెంట్‌ 3 డోసులు పూర్తయితే వారి ఖాతాలో రూ.2 వేలు జమ చేస్తారు. ప్రభుత్వం సాయాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తుంది. మొదటి, రెండు, నాలుగు విడతల బాధ్యత ఎఎన్‌ఎంలు చూస్తారు. మూడో విడత బాధ్యత ఆస్పత్రి అధికారులు పరిధిలో ఉంటుంది ఏ విడత రిజిస్ట్రేషన్‌ పూర్తయితే ఆ మేరకే డబ్బులు జమవుతాయి.