Jan 31,2023 23:15

సమావేశంలో మాట్లడుతున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాలో మాతృ మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం మాత మరణాలపై వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా సిబ్బందితో సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల్లో జిల్లాలో ఏడు మాత మరణాలు సంభవించడం దురదష్టకరమన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన పర్యవేక్షణ ఉంటే వీటిలో ఎక్కువగా నివారించదగిన కారణాలు ఉన్నాయన్నారు. గర్భిణీగా నమోదైన నాటి నుంచి ఎంసిపి కార్డులో సమగ్రమైన విధానంలో గర్భిణులకు చేసే వైద్య పరీక్షల వివరాలను పొందు పర్చాలన్నారు. తద్వారా తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉంటుందన్నారు. రక్త పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, రక్తంలో హిమోగ్లోబిన్‌ వంటి పరీక్షల ఫలితాలు కార్డులో నమోదు చేయాలన్నారు. ప్రతి గర్భిణీకి నాలుగు సార్లు వైద్యాధికారితో పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాద స్థితిలో ఉన్న ప్రతి గర్భిణీ విషయంలో ఇడిడి తేదీకి పది రోజులు ముందుగానే రిఫరల్‌ ఆసుపత్రులకు తరలించాలన్నారు. రక్తం తక్కువగా ఉన్న కేసులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత రాకుండా సమతులమైన ఆహారం అందించే విధంగా అంగన్‌వాడీల సేవలు వినియోగించుకోవాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో మాతమరణాలు సంభవించడానికి కారణాలను పూర్తిగా నివారించే దిశగా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రతి గర్భిణీకి పిఎంవివై, జిఎస్‌వై, జెఎస్‌ఎ వంటి పథకాలను వినియోగించుకోవాలని, ప్రతినెల 9న జరిగే పిఎం ఎస్‌ఎంఎ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తామనానరు. ఈ కార్యక్రమంలో డిటిసిఒ ఎన్‌.వసుంధర, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సనత్‌కుమారి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు జి.వరలక్ష్మి, లూసి తదితరులు పాల్గొన్నారు.