Oct 12,2023 23:23

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించి మాట తప్పిన సిఎం జగన్మోహన్‌ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్‌ ధరల పెంపుదలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం రాజమహేంద్రవరం నగరంలోని కోటగుమ్మం సెంటర్లో ప్రజల నుంచి సంతకాల సేకరణను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు, సిపిఐ(ఎంఎల్‌ న్యూడెమోక్రసీ) నాయకులు సిహెచ్‌ వెంకటేశ్వరరావు, కె.జోజి మాట్లా డారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలను పెంచబో నని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలపై పెద్దఎత్తున విద్యుత్‌ ఛార్జీలను పెంపుదల చేశారని దుయ్యబట్టారు. ప్రతీ నెల విద్యుత్‌ ఛార్జీలను క్రమక్రమంగా పెంపుదల చేస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తామని, 200 యూనిట్లు వరకు అందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి నేడు ఆ హామీని పక్కన పెట్టి ప్రజలకు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ధ్వజ మెత్తారు. రైతుల ఉచిత విద్యుత్‌కు సైతం ఎసరు పెడుతున్నారని, ఎస్‌సి, ఎస్‌టి, వృత్తిదారులకు ఇస్తున్న రాయితీల్లోనూ కోత పెట్టారన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం ద్వారా రాబోయే కాలంలో పూర్తిగా రాయితీలను ఎత్తివేసేందుకు కుట్రలు సాగిస్తుం దని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెండు కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారని, అదాని తదితర కార్పొరేట్లకు ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూకు మ్మడిగా విద్యుత్‌ సరఫరా పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నెల 15వ తేదీన రాజమహేంద్రవరం నగరంలోని ఆజాద్‌ చౌక్‌ వద్ద విద్యుత్‌ ధరల పెంపుదలను నిరసిస్తూ చేపడుతున్న ప్రజా బ్యాలెట్‌లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని తమ నిరసన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కల్గించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, సిపిఎం నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, రాజులోవ, వెంకటేశ్వర రావు, రామకృష్ణ, సిపిఐ నగర వి.కొండలరావు, సిపిఐ నాయకులు కొండ్రపు రాంబాబు, సప్ప రమణ, యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, నల్ల రామారావు, న్యూడెమోక్రసీ నాయకులు సత్తిబాబు పాల్గొన్నారు.