ప్రజాశక్తి - రాజమహేంద్రవరం మర్క్స్ సిద్ధాంతమే ప్రపంచానికి దిక్సూచి అని, పెట్టుబడిదారీ విధానాలే ఆర్థిక మాంద్యానికి కారణమని ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు పి.సతీష్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో పేపర్ మిల్ వద్ద గల బిటిఆర్ భవన్‌లో ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ 205వ జయంతి సందర్భంగా ఆర్థిక మాంద్యం, ప్రాంచదేశాలు అనే అంశంపై సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు కార్ల్‌మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం జరిగిన సదస్సులో పి.సతీష్ మాట్లాడుతూ ప్రపంచాన్ని అనేకమంది తత్త్వవేతలు విశ్లేషించారని, కారల్ మార్క్స్ దోపిడీ ఎలా జరుగుతుందో, దోపిడీ పోవాలంటే కార్మిక వర్గం ఐక్యమై పోరాడాలని కమ్యూనిస్టు మానిఫెస్టోలో వివరించారని చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరం సంక్షోభాల్లో ఉంటుందని, అది అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణమని వివరించారు. కార్మికులను బానిసలుగా చేసి వారి శ్రమను దోచుకుని లాభాలు గడిస్తుందని, కార్మికులు పనిగంటల పెంచి వేతనాలు తగ్గించి పెట్టుబడి పోగు పడటంతో, కార్మికుల్లో కొనుగోలు శక్తి లేక ఆర్థిక సంక్షోబాలు ఏర్పడతాయని మార్క్స్ ఆనాడే చెప్పారన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుందని, 2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని ఈ సంక్షోభం దాటికి అనేక పెట్టుబడిదారీ దేశాలు దివాళా తీశాయన్నారు. భారతదేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాలు వేగవంతంతో ప్రైవేటుకు తెగ నమ్ముతుందఆ్నరు. భారతదేశం నేడు సంక్షోభ ఛాయలు కనిపిస్తున్నాయని, రానున్న రోజుల్లో సంక్షోభంలో కూరుకుపోతుందని, అందుకు మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. ఈ తరుణంలో కారల్ మార్క్స్ స్ఫూర్తిగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని, పెట్టుబడిదారీ విధానాన్ని తిప్పి కొట్టాలని, కార్మిక వర్గ రాజ్యాల స్థాపనకు పూనుకోవాలని అన్నారు. ఈ సదస్సుకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోఎస్‌ఎస్.మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, బి.పవన్, ఐఎస్, రాజు, కష్ణ, వెంకటేశ్వరరావు, శంకర్, రాంబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
దేవరపల్లి : ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ 205వ జయంతి నేపథ్యంలో దుద్దుకూరులో ప్రగశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో మార్క్స్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, జానీ, మల్లిమొగ్గల పోసి బాబు, వేముల వెంకటేశ్వరరావు, బంగారయ్య, అబ్బులు పాల్గొన్నారు.










