రోడ్డు చెంతనే అక్రమంగా నిర్మాణాలు
చిరు వ్యాపారులకు అద్దెకిస్తూ జేబులు నింపుకుంటున్న వైనం
ప్రయాణికుల పాట్లు... పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి- కడియం
కడియంలో రోడ్డు మార్జిన్లు మాయమయ్యాయి. కొంత మంది అక్రమార్కులు రోడ్డు వెంబడి మార్జిన్లను ఆక్రమించి నిర్మాణాలు సాగించారు. అంతేకాకుండా చిరువ్యాపారులకు వీటిని అద్దెకిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఆక్రమణల ఫలితంగా రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ప్రతి రోజూ పలువురు జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మార్గం గుండా ప్రయాణించినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
రోడ్డు మార్జిన్లు ఆక్రమించడం, అందులో తాత్కాలికంగా రేకుల షెడ్డులు నిర్మించడం, పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించడం, కొన్నాళ్లపాటు చిరు వ్యాపారం నిర్వహించి ఆ తర్వాత ఆ స్థలాన్ని అద్దెకివ్వడం నెలా నెలా అద్దెతో జేబులు నింపుకోవడం కడియంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా కడియం కెనాల్ రోడ్డులో బస్టాండ్ నుంచి దేవీచౌక్ సెంటర్ మీదుగా వెంకటేశ్వరస్వామి గుడి వరకూ, అలాగే దేవీచౌక్ సెంటర్ నుంచి హైస్కూల్ రోడ్డు భాస్కర సెంటర్ వరకూ, బొబ్బిలి బ్రిడ్జి సెంటర్ నుంచి బుర్రిలంక రోడ్డులో పిల్లకాలువగట్టు వరకూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆర్ అండ్‌బి, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జాగా కనిపిస్తే పాగా వేసేస్తున్నారు కొందరు ఆక్రమణ దారులు. ఆనక పక్కా నిర్మాణాలు చేపట్టి వేలకు వేలు అద్దెలు వసూలు చేసుకుంటూ దర్జాగా కాలం గడిపేస్తున్నారు. అవసరం ఉన్నంత మేరకు రోడ్డు మార్జిన్లు ఆక్రమించేశారు. చివరకు డ్రెయినేజీలనూ వదలట్లేదు. దీందో డ్రెయినేజీలు పూడుకుపోయి మురుగు నీరు పారట్లేదు. ఫలితంగా తీవ్ర దుర్వాసన రావడంతో పాటు కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ రోడ్ల వెంబడి చిరువ్యాపారాలతో పాటు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, మద్యంషాపులు, దేవాలయాలు, నివాసప్రాంతాలు , సినిమా హాళ్లు ఉన్నాయి. ఆక్రమణలతో రోడ్డు కుచించుకుపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆక్రమణకు కొత్తరకం ఎత్తుగడ
ఈ రోడ్లకు సమీపాన సొంత స్థలాలు, ఇళ్లు గలవారిలో కొందరు కోటీశ్వర్లు తమకున్నటువంటి దస్తావేజులను సాకుగా చూపిస్తూ మార్జిన్లను ఆక్రమిస్తూ యథేచ్ఛగా పక్కా భవనాలు, వ్యాపార సముదాయాలు నిర్మించారని, అవి నేటికీ కొనసాగుతున్నాయని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం, స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లకిరువైపులా మార్జిన్ల రూపంలో ఉన్న లక్షల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారుల చెరనుండి విడిపించాలని, ఆక్రమణలు జరగకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని ప్రజలు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు , సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.










