Apr 04,2023 23:00

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్‌లో ధరలు లేకపోవటంతో మామిడి రైతులు కుదేలవుతున్నారు. ఏటా నష్టపోతున్న తమకు ఈ ఏడాదైనా లాభాలు వస్తాయనుకున్న మామిడి రైతుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. ఈదురు గాలులకు పిందెలు, కాయలు రాలిపోతుండగా వర్షాల కారణంగా మంగు తెగులు సోకడంతో ఈ ఏడాదీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మార్చిలో ఆకాశాన్ని అంటాల్సిన ధరలు పాతాళానికి పడిపోయాయి. జిల్లాలో 14,753 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. ప్రస్తుత సీజన్‌లో ముందస్తు పూతలు కనిపించడంతో నవంబర్‌ నుంచి మామిడి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టారు. తొలి విడతగా వచ్చిన మామిడిపూతలు జనవరిలో పిందెగా మారడంతో ఈ సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందనిఆనంద పడ్డారు. అయితే ఈదురు గాలులు, వర్షాలకు పిందె రాలిపోయింది. కొద్దిరోజులకు మరల తిరిగి పూత రావడంతో పంట నాణ్యత కాపాడేందుకు ఇప్పటికే 10 నుంచి 14 సార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. అయినా వర్షాల రూపంలో దురదష్టం వెంటాడడంతో మామిడికాయల నాణ్యత నిలవలేదు. వర్షాల కారణంగా మంగు తెగులు సోకడంతో కాయల నాణ్యత పడిపోయి, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
సిండికేట్‌తో ధరలు పతనం
మామిడి సీజన్‌ ప్రారంభంలో బంగినపల్లి టన్నుధర దాదాపు రూ.90 వేల నుంచి రూ.70 వేల మధ్య పలికింది. తోతాపురి (కలెక్టర్‌) రకం మామిడి రూ.50 వేల నుంచి రూ.40 వేల మధ్య పలికింది. మార్చి మధ్యంతరం వరకు ఇవే ధరలు కొనసాగగా, వర్షాల అనంతరం ధరలు భారీగా పతనమయ్యాయి. రాజమహేంద్రవరంలో మామిడి మార్కెట్లో విక్రయించటంతో పాటు కలకత్తా, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు వచ్చి తోటలను నేరుగా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం కలకత్తా నుంచి కొందరు వ్యాపారులు వచ్చి వారు చెప్పిందే వేదంగా వ్యవహారం నడుస్తోంది. కనిష్ఠంగా రూ.7వేలకు పడిపోయిందంటే వారి ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ రైతులు వాపోతున్నారు. మంగుతెగులు సాకు చూపి స్థానికంగా ఉండే కమీషన్‌ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ను తోతాపురి కాయల ధర రూ.5 వేల నుంచి రూ.10 వేలకే పరిమితం అయ్యింది. టన్ను చిన రసాల ధర రూ.6 నుంచి రూ.8 వేలు, బంగినపల్లి ధర టన్ను రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది. నాణ్యత కలిగిన కాయలు 20 శాతానికి మించి లేకపోవడంతో రైతులు కనిష్ఠ ధరలకు మాత్రమే పరిమితమవుతున్నారు.
వేధిస్తున్న అకాల వర్షాలు, తెగుళ్లు
మార్చి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 37 డిగ్రీల పైబడి నమోదయ్యాయి. అయితే మార్చి చివరి వారంలో వర్షాలు కురవడంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు స్వల్పంగా నమోదు కావడం, ఉదయం పూట పొగమంచు కారణంగా మామిడిపై మంగు తెగులు విజంభించింది. ఉద్యానవన శాఖ అధికారులు వాతావరణ ఆధారిత పంటల బీమాపై కనీసం దష్టి పెట్టలేదు. ఫలితంగా రైతులు మార్కెట్లో ధర లేక మరో వైపు బీమా అమలు కాక నష్టపోతున్నామని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టం అందించే అవకాశం లేదు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకొక్క జిల్లాకు కొన్ని పంటలకు మాత్రమే బీమా సదుపాయం ఉంది. జిల్లాలో అరటికి మాత్రమే బీమా సౌకర్యం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో మామిడి పంటలకు నష్టం జరగలేదు. జిల్లాలోని 19 మండలాల్లోనూ మామిడి సాగు జరుగుతోంది. రాజాగనరం, గోపాలపురం మండలాల్లో అధికంగా సాగు ఉంది.
- వి.రాధాకృష్ణ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
ఈ ఏడాది అంతా నష్టమే...
ఈ ఏడాది మామిడి సాగు నష్టాలే. . వర్షాలకు తోటల్లో కాయలు పూర్తిగా పాడైపోయాయి. వాతావరణం అసలు అనుకూలించలేదు. మందులు వాడినా పుచ్చులు ఎక్కువగా వచ్చాయి. ధరలు లేకపోవటం, దిగుబడులు లేకపోవటంతో పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. ప్రభుత్వం ఆదుకోవాలి. పరిహారం అందజేయాలి.
- ఎన్‌.చక్రవర్తి, మామిడి రైతు, శ్రీకృష్ణపట్నం, రాజానగరం మండలం