ప్రజాశక్తి - ధవళేశ్వరం
రైతులకు సాగునీరు అందించే ప్రధానమైన ప్రాజెక్టుల కాలువల పర్యవేక్షణకు ఇరిగేషన్ శాఖలో లస్కర్లది కీలక పాత్ర. క్షేత్రస్థాయిలో కాలువలపై నిరంతరం వీరి పర్యవేక్షణ ఉంటుంది. కాలువల పూర్తి బాధ్యత వీరిపైనే ఉండేది. లాకుల వద్ద నీటి యాజమాన్యం చేయడానికి అవసరమైన లస్కర్ వ్యవస్థ ప్రస్తుతం నిర్వీర్యమైంది. గోదావరి డెల్టాల పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు దశాబ్దాల క్రితం 3వేల మందికిపైగా లస్కర్లు ఉండేవారు. ప్రస్తుతం 300 మాత్రమే పర్మినెంట్ లస్కర్లు పనిచేస్తున్నారు. అమలాపురం ఇరిగేషన్ డివిజన్‌లో ఒకప్పుడు 185 మంది ఉండగా ప్రస్తుతం 50 మంది కూడా లేని పరిస్థితి. ఖాళీ అయిన లస్కర్ పోస్టుల భర్తీని నిలిపేయడమే దీనికి కారణం. కొన్నాళ్ల క్రితం వరకూ కనీసం కారుణ్య నియామకాలైనా జరిగేవి. తరువాత వాటిని కూడా నిలిపివేశారు. ఎవరైనా లస్కర్ రిటైరైనా, మతి చెందినా ఆ స్థానం ఖాళీగా ఉండిపోతోంది.
నీటి యాజమాన్యంలో లస్కర్లే కీలకం
కాలువలపై నీటి యాజమాన్యం చేయడంలో లస్కర్ల పాత్ర అత్యంత కీలకం. పంటబోదెలు, ఛానళ్లవారీగా ఉన్న ఆయకట్టుకు ఏ సమయంలో ఎంత నీరివ్వాలి? ఎంత నీరు పెంచాలి, తగ్గించాలనేది అధికారుల సూచనలకు అనుగుణంగా వీరే చూస్తారు. డెరైక్ట్ పైప్(డిపి)లు, ఛానల్స్ హెడ్ రెగ్యులేటర్లను ఎత్తడం, దించడం, లీకులు అరికట్టడం, లాకులవద్ద నీటిమట్టాలు పరిశీలించడం వంటి పనులునూ చేస్తారు. ప్రతి ప్రధాన లాకు వద్ద లాకు సూపరింటెండెంట్, నలుగురైదుగురు లస్కర్లు బాధ్యతలు నిర్వహించేవారు. నిరంతరం అందుబాటులో ఉండేలా వారికి లాకుల వద్దే క్వార్టర్లను నిర్మించారు. ప్రస్తుతం కొన్ని ప్రధాన లాకుల వద్ద ఒక్క లస్కర్‌కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పక్క లాకు పరిధిలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు లస్కర్లను ఇన్‌ఛార్జిగా వేస్తున్నారు. ఐదారుగురు చేసే పని ఒకరు చేయాల్సి వస్తోంది. ఈ లోపాలవల్ల నీటి యాజమాన్య నిర్వహణ విఫలమవుతోంది. లస్కర్ల పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల లాకుల భద్రత కూడా ప్రమాదంలో పడింది. చాలాచోట్ల లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. లస్కర్లు లేకపోవడంతో క్వార్టర్లనూ పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్నిచోట్ల లస్కర్ల క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరగా, మరికొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి.
తాత్కాలిక సిబ్బంది నియామకం
ఉభయగోదావరి జిల్లాలో 685 మందిని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు మేరకు ఆపరేషన్ మెయింటెనెన్స్ గ్రాంట్‌లో అవుట్‌సోర్సింగ్ విధానంలో 2010లో ప్రభుత్వం తాత్కాలిక లస్కర్లుగా నియమించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వీరికి ప్రతినెలా రూ.10,500 వేతనంగా నిర్ణయించారు. ఏడాదిలో పది నెలల కాలానికి వీరిని తీసుకుంటున్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లు, వరదల సమయాల్లోనే వీరిని నియమిస్తున్నారు.
9నెలలుగా అందని వేతనాలు
. తొమ్మిది నెలలుగా కాంట్రాక్ట్ లస్కర్లకు వేతనాలు అందలేదు. సుమారు రూ.7 కోట్లకు పైగా వేతన బకాయిలు ఉన్నాయి. ఇచ్చే కొద్దిపాటి వేతనం కూడా అందకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక వడ్డీలకు అప్పులు చేసి రుణాల ఊబిలో కూరుకుపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నరసాపురంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందించారు. అయినా వారికి ఎలాంటి న్యాయం జరుగలేదు.










