May 16,2023 00:00

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ ఆధ్వర్యాన నగరంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌లోని రామాలయం సెంటర్‌ వరకూ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ భవానీ మాట్లాడుతూ లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కుప్పం నుంచి జనవరి 27న లోకేష్‌ తన పాదయాత్ర చేపట్టి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో తన పాదయాత్రను ముగించుకుని ఇప్పటి వరకూ 1,269 కిలోమీటర్లు పాదయాత్రలో నడిచారన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని,జగన్‌ పాలనలో పడుతున్న కష్టాలను ఆయనకు ప్రజలు వచ్చి విన్నవిస్తున్నారన్నారు. అనంతరం కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో శ్యామలానగర్‌ రామాలయం సెంటర్‌లో యువగళం పాదయాత్ర 100 రోజుల కేక్‌కు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, షేక్‌ సుభాన్‌, ద్వారా పార్వతి సుందరి, మజ్జి రాంబాబు, నక్కా దేవీవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.