ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లాలోని 64 కోర్టుల్లో ఏర్పాటు చేసిన బెంచ్‌ల ద్వారా 7,531 పైగా కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం పరిష్కరించారు. శనివారం స్థానిక కోర్టుల ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యుయు.ప్రసాద్ ప్రశంసించారు. రాత్రి 7 .30 గంటల వరకూ కేసుల పరిష్కారం సాగుతోందనిన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున పరిష్కారం కోసం వచ్చిన చివరి కేసు పరిష్కారం చూపే వరకు ఎంతసేపైనా వేచి చూసి సమన్యాయం కోసం న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, ప్రతి ఒక్కరూ పని చేస్తామన్నారు. రాజీ ద్వారా కేసులు సత్వర పరిష్కారం సాధ్యం అవుతుందని, ఆ దిశలో ఇరు పక్షాలు రాజీ ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు న్యాయ మూర్తులు పేర్కొన్నారు. ఇందువల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడం తోపాటు మంచి అనుబంధాలు ఆత్మీయతలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం ద్వారా సత్వర న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షిదారుల్లో లోక్ అదాలత్‌లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం కోసం సామాజిక బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ బెంచ్‌కు వచ్చిన కేసులకు పరిష్కారం చూపి అవార్డ్ వెల్లడిస్తామని తెలిపారు. జిల్లాలో 4 నూతన జిల్లాల (కాకినాడ, బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా) పరిధిలో 43 బెంచ్‌లలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించామని పేర్కొన్నారు. పోక్సో, మర్డర్ వంటి కేసులు తప్ప, రాజీ ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న కేసులకు పరిష్కారం చూపుతామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో పదో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.నాగేశ్వరరావు, 8వ అదనపు జిల్లా జడ్జి పిఆర్.రాజీవ్, ఫ్యామిలీ కోర్టు 9వ అదనపు జిల్లాలో జడ్జి ఎం.మాధురి, సీనియర్ జిల్లా జడ్జి డిఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది జియువిబి రాజు, పలువురు న్యాయవాదులు, రవాణా శాఖ అధికారులు, డాక్టర్లు, ఇన్సూరెన్స్, టెలికాం కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.










