Feb 22,2023 23:46

ఫంగస్‌ రకం చేపలు

పెరుగుతున్న కొత్తరకం చేపల సాగు
ప్రజాశక్తి - కడియం
ఇతర దేశాల నుంచి వచ్చిన పంగాసియస్‌(ఫంగస్‌) మన రాష్ట్రంలో ఎన్నో నిందలు మోస్తూ మొత్తానికి నిలదొక్కుకుంది. రైతులకు లాభాల పంట పండిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జెల్ల జాతికి చెందిన ఈ చేప తింటే వాతం వస్తుందని అపోహ బలంగా నాటుకుపోయింది. కాని ఈ చేప తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని గుర్తించడంతో ఇతర రాష్ట్రాలకు భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందుకనే ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలలో ఈ చేప సాగు పెరుగుతోంది. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ఈ చేప ప్రభుత్వ ఆమోదం పొందింది. ఆక్సిజన్‌, నీరు వంటివి తక్కువ అయినప్పటికీ చలించకుండా జీవిస్తుంది. తెగుళ్లను ఎదుర్కొంటుంది. పెరుగుదలలో దీనిని మించింది లేదనే చెప్పాలి. మామూలు జాతి చేపలు ఏడాదికి 1 కేజీ నుంచి 2 కేజీలు పెరిగితే ఇది 2.5 కేజీల నుంచి 4 కేజీలు బరువు పెరుగుతుంది. ధర తక్కువైనా దిగుబడి అధికంగా ఉండడం వల్ల రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడిని కూడా కొందరు రైతులు సాధించారు. సరాసరి రైతు ధర కేజి రూ.70 నుంచి రూ.80 ఉంటుంది. కడియం మండలం వేమగిరి, రూరల్‌ మండలం ధవళేశ్వరం, బొమ్మూరు తదితర ప్రాంతాలలో ఈ చేప సాగు చేపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో ఈ చేప ఎగుమతులు జరుగుతున్నాయి.
అపోహలను వీడాలి
ఫంగస్‌ చేపపై కొందరికున్న అపోహలు తొలగాలి. ఈ చేపను అన్ని వయస్సుల వారు తినొచ్చు. ముల్లు సమస్య ఉండదు. అందుబాటు ధరలో దొరుకుతుంది. రైతులకు ఎంతో గిట్టుబాటు ఇస్తున్నందున ఈ చేప సాగుకు ముందుకొస్తున్నారు.
-వి.కష్ణారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి