ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్
జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ పంట నష్ట పరిహారంగా వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 15087 మంది రైతులకు రూ.11.17 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ అయ్యిందని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. శనివారం జిల్లాస్థాయిలో వైఎస్‌ఆర్ రైతు దినోత్సవం, వైయస్సార్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమంలో కొవ్వూరు మండలం ఐ. పంగిడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, జెసి ఎన్. తేజ్ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం సొమ్ము సిఎం జగన్ వర్చువల్ ద్వారా లబ్ధిదారుల రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారన్నారు. విత్తనం నాటడం నుంచి ధాన్యం కొనుగోలు వరకు జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. జిల్లాకు రెండు పంటలకు నోటిఫై చేయబడిన వరి - దిగుబడి ఆధారంగా , అరటి - వాతావరణ ఆధారిత నమోదు కోసం రైతులపై భారం పడకుండా, రైతుల తరపున ప్రీమియం వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. జెసి మాట్లాడుతూ పిఎమ్ కిసాన్, రైతు భరోసా ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిచడంతో పాటు, ప్రధాన మంత్రి పసల బీమా క్రింద రాష్టంలో రైతుల వాటా ఫ్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లించి పంట నష్ట పోయిన రైతులను గుర్తించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా సొమ్మును ప్రభుత్వం అదే సీజన్లో రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమం
జగనన్న సురక్ష కార్యక్రమంలో ద్వారా ఎవరికీ రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం వివిధ రకాల ధ్రువ పత్రాలు, భూమి సరిహద్దు కొలతలు వంటి 11 రకాల సేవలు అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఓటరుగా నమోదు కావాలి
ఈ నెల 21 నుంచి ఆగస్టు 20 వరకు ఓటు నమోదు, తొలగింపు చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారం 7, 8 ద్వారా సవరణ చేస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు.. ఇంటిటికి వచ్చే బూత్ లెవెల్ అధికారి కోరిన వివరాలు ఇచ్చిసహకరించాలనిఅన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా హారికల్చర్ అధికారి వి. రాధాకష్ణ, హార్టికల్చర్ శాస్త్రవేత్త కె.రామా నందం, ఎడి వి.చంద్రశేఖర్, ఏఎమ్ సీ చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాస్, సర్పంచ్ గోశాల నాగార్జున అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుని వినతి
జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఐ.పంగిడి గ్రామంలో జరిగిన వైఎస్‌ఆర్ రైతు దినోత్సవం, వైయస్సార్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఐ పంగిడి గ్రామం జాంపేట నివాసి కూనిశెట్టి నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ను కలిసి తాను వికలాంగుడునని, ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకోవడానికి తన వద్దనున్న ట్రై సైకిల్ పూర్తిగా పాడై పోయిందన్నారు. తన వ్యాపారం చేసుకునేందుకు వీలుగా బ్యాటరీ ద్వారా నడిచే ట్రై సైకిల్ ను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలని కలెక్టర్ కు విన్నవించారు. జిల్లా కలెక్టర్ స్పందించి రెండు మూడు రోజుల్లో బ్యాటరీ తో నడిచే ట్రై సైకిల్ మంజూరు చేసి అందిస్తామని నాగేశ్వరరావుకు హామీ ఇచ్చారు.
ఘనంగా రైతు దినోత్సవం
రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల్లో వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సిహెచ్.శ్యామ్ రాజ్ నాయక ఆధ్వర్యంలో కళాశాల జాతీయ సేవా పథకం సిబ్బంది శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్‌రాజ్‌నాయక్, సిబ్బంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దివంగత మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజా సంక్షేమానికి, వ్యవసాయ రంగం అభివద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సీతానగరం గ్రామం అభ్యుదయ రైతు సూర్య ప్రకాష్‌రావును జ్ఞాపికలతో సన్మానించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికత తో వ్యవసాయం చేస్తున్న రైతు లను ఆదర్శంగా తీసుకోవాలర్కొన్నారు. సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ప్రజా సంక్షేమానికి చేసిన పథకాలను, జీవిత విశేషాలను వివరించారు. అభ్యుదయ రైతు సూర్యప్రకాష్ నూతన వ్యవసాయ సాగు విధానాలను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు భోదన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.










