Feb 12,2023 23:20

విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ భరత్‌, మంత్రి వనిత, ఎంఎల్‌ఎ రాజా

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
మహిళా లోకానికి కవయిత్రి మొల్ల ఆదర్శనీయురాలని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. నగరంలో గౌతమి ఘాట్‌ వాకర్స్‌, యోగ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో మొల్ల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైసిపి జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వనిత, ఎంపీ మార్గాని భరత్‌ పాల్గొన్నారు. మంత్రి వనిత జ్యోతి ప్రజ్వలన చేసి, కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. మహా కవయిత్రి మొల్ల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన కమిటీ సభ్యులను మంత్రి వనిత అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ సాహిత్యానికి పెట్టింది పేరైన రాజమహేంద్రవరం గోదారమ్మ శిగలో మరో ఆణిముత్యం చేరిందని, అదే తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల విగ్రహం అన్నారు. సంస్కతంలో వాల్మీకి రచించిన శ్రీమద్రామయణాన్ని ఆధారంగా చేసుకొని తేట తెలుగులో పద్య కావ్యంలో మొల్ల రచించారని, ఆ కావ్యమే మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. కంద పద్యాలు ఎక్కువగా ఉండటం వల్ల కంద రామాయణం అని కూడా అంటారని చెప్పారు. కేవలం అయిదు రోజుల్లో ఈ కావ్యాన్ని రాసినట్టు చెబుతారని, మొల్ల రచన వాడుక భాషకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజలకు అత్యంత చేరువైన కావ్యం మొల్ల రామాయణం అని ఎంపీ భరత్‌ వివరించారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణిగా వినుతికెక్కారని, అటువంటి మహా కవయిత్రి మొల్ల విగ్రహం రాజమండ్రిలో నెలకొల్పడం చాలా సంతోషమని అన్నారు. మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఎంపీ భరత్‌ అభినందించారు.
ఎంఎల్‌ఎ రాజా మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్త్యం కలిగిన రాజమహేంద్రవరం నగరం కవులు, కవయిత్రులకు కేంద్రమన్నారు. అలాంటి సారస్వత్ర కేంద్రంలో పవిత్ర గోదావరి తీరాన మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం హర్షణీయమన్నారు. ఎంత ఎదిగినా ఒదిగివుండాలనే లక్షణం కవయిత్రి మొల్లలో మెండుగా ఉండేదని, తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదని, భగవత్‌ వరప్రసాదం వల్లే కవిత్వం చెప్పగలుగుతున్నానని చెప్పడం ఆమెలోని గొప్పతనానికి నిదర్శనమని రాజా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణ కమిటీ ఛైర్మన్‌ రాయపూడి శ్రీనివాసరావు, కో-ఛైర్మన్‌ మెరుగుపల్లి సత్యనారాయణ, పేరూరి గంగాధరం, కన్వీనర్‌ కాలేశ్వరరావు, ఎల్లా అప్పారావు ఉడయార్‌, పసలపూడి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.