ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నగరంలోని ప్రధాన మార్కెట్‌లలో టమోటా కిలో రూ.60, బీర రూ.45, మిగిలిన కూరగాయలు రూ.40 నుంచి రూ.50 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.50 పైమాటే. తప్పనిసరి పరిస్థితుల్లో చేసేది లేక కొనుగోలుదారులు తక్కువ మొత్తంలో కూరగాయలను తీసుకెళ్తున్నారు. కార్తీక మాసం లో ధరలు సాధారణంగా తెలిసిన విషయమే. ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడులు తగ్గిపోవడంతో తాజాగా ధరల పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. రూ.200 వెచ్చించినా కేజీ చొప్పున నాలుగు రకాల కూరగాయలే అందుబాటులో ఉంటున్నాయి.
ఉష్ణోగ్రతల పెరగడంతో ధరలు పైపైకి
గత 20 రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సరాసరి 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతోంది. జిల్లాలో వరి పంటలతో పాటు కూరగాయల సాగుపై అధిక శాతంగా రైతుల ఆధారపడి జీవి స్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17,500 ఎకరాల నుంచి 30,000 ఎకరాల వరకు సీజన్ ఆధారంగా కూరగాయల సాగు జరుగుతోంది. లాక్ డౌన్ కాలంలో నష్టాలు చవి చూడడంతో రైతులు 40 శాతం మంది ప్రత్యామ్నాయ పంటలు వేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు, చిత్తూరులో టమోటా సాగు పూర్తిగా పంట నష్టం జరిగింది. జిల్లాలో సాగు తగ్గిపోవడం, పక్క రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో ఇప్పుడు టమోటాకు డిమాండ్ పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమోటాకు రూ.40 లభిస్తోంది. చిల్లర వర్తకులు కిలో రూ.60 నుంచి రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు.
నెల రోజుల వ్యవధిలో పెరిగిన ధరలు
కూరగాయల ధరలు నెలరోజుల ముందున్నవాటికన్నా రెండింతలు పెరిగాయి. చిక్కుడు కిలో రూ.60కు లభించేది. రూ.120కు పెరిగింది. గోరు చిక్కుడు ధర కిలో రూ.25 నుంచి రూ.60, వంకాయ కిలో రూ.30 నుంచి రూ.50, కాకరకాయ కిలో రూ.35 నుంచి రూ.70, బెండకాయ కిలో రూ.30 నుంచి రూ.40, బీరకాయ కిలో రూ.40 నుంచి రూ.70, బీన్స్ కిలో రూ.40 నుంచి రూ.60, క్యాప్సికం రూ.40 నుంచి రూ.100, క్యాబేజీ పువ్వు రూ.20 నుంచి రూ.60, పుదీనా రూ.30 నుంచి రూ.80, కొత్తిమీర రూ.40 నుంచి రూ.120, పచ్చిమిర్చి రూ.40 నుంచి రూ.80కి పెరిగింది. ములక్కాడలు ఒక్కటి రూ.5 నుంచి రూ.10, క్యారెట్ రూ.50 నుంచి రూ.70లకు పెరిగింది. బంగాళదుంపలు కిలో రూ.40 నుంచి రూ.80 చేరాయి. అల్లం కిలో రూ 250 నుంచి రూ. 400కు చేరింది. పెరిగిన ధరలు కొనుగోలుదారులకు చమటలు పట్టిస్తున్నాయి.
పెరిగిన రవాణా ఖర్చులు
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గించినప్పటికీ రాష్ట్రంలో ఆ స్థాయిలో ఉపశమనం లభించలేదు. ఫలితంగా ఇంధన ధరలు కూడా కూరగాయల ధరలు పెరగడానికి ఇంకో కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా దిగుబడులు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ వ్యాపారాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. లారీలు, ట్రక్కుల యజమానులు చార్జీలను పెంచారు. మరోవైపు సహజంగానే వాటి ధరలు పెరగడం మొదలయ్యింది. రవాణా ఛార్జీలు పెరగడంతో హోల్‌సేల్ వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారు. గడిచిన నెల రోజులుగా పెళ్లిళ్ల సీజన్ ప్రారం భమైంది. దీంతో కూరగాయలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో క్యాటరింగ్, హోటల్ యాజ మాన్యాలు నాణ్యమైన దిగుబడులు అధిక ధరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని రైతు బజార్ల నుంచి సైతం నాణ్యమైన సరుకు హోల్‌సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.










