ప్రజాశక్తి - నిడదవోలు
దేశంలో ఉన్న కుల వివక్షతను రూపుమాపేందుకు ఉద్యమించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు పిలుపునిచ్చారు. కెవిపిఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చౌక్ వద్ద కెవిపిఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెవిపిఎస్ అంటే కుల సంఘం కాదని, కుల నిర్మూలన సంఘమని అన్నారు. 'ఆత్మ గౌరవం. సమానత్వం. కులనిర్మూలన' ధ్యేయంగా కెవిపిఎస్ ఏర్పడిందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా ఇండియా అభివృద్ది కాకపోవడానికి కులమే కారణమని పేర్కొన్నారు. కుల నిర్మూలనకు పూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో మహనీయులు కుల వివక్ష, అంటరానితనం, కుల నిర్మూిలన, సమానత్వం కోసం పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. ఇప్పటికీ సమాజంలో కులం అన్ని రంగాల్లోనూఉందని, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో కులవివక్షత పాతుకుపోయిందని ఆరోపించారు. మనువాదుల పాలనలో మతాన్ని రాజకీయాల్లోకి. చొప్పించి నేడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ధ్వంసం చేసే కుట్రలు ప్రారంభం అయ్యాయని అన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు డొంకా రమేష్, జి.డానియల్. గారపాటి ప్రసన్న కష్ణ. టి. సర్వేశ్వర రావు, జి.రాంబాబు, సుబ్బు, టి.నాగేశ్వర రావు, దుర్గా, నరేష్ పాల్గొన్నారు.










