ప్రజాశక్తి- కడియం
మండలంలోని కడియపులంకలో కుక్కల దాడిలో జింక మృత్యువాత పడింది. గోదావరి లంకల్లో ఉండే వందలాది జింకల్లో కొన్ని గతంలో సంభవించిన వరదలకు గల్లంతయ్యాయి. శుక్రవారం గోదావరి లంక నుంచి చెదిరిపోయిన ఒక జింక కడియపులంకలో గోదావరి ఒడ్డుకు చేరింది. దీనిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ మార్గాని అమ్మాణి ఈ సమాచారాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులకు అందించారు. రాజమహేంద్రవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్, బీట్ ఆఫీసర్ ఆనంద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే జింక మృతి చెందింది. జేగురుపాడు పశుసంవర్థక శాఖ అధికారి కిరణ్, విఆర్‌ఒ జ్యోతి తదితరులు సమక్షంలో జింకకు శవ పంచనామా నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.










