Feb 19,2023 23:36

ఎంపీ భరత్‌, కుడిపూడిని సత్కరిస్తున్న నాయకులు

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
స్థానిక సంస్థల ఎంఎల్‌సి వైసిపి అభ్యర్థిగా పోటీ పడుతున్న కుడిపూడి సూర్యనారాయణ విజయానికి కృషి చేద్దామని ఎంపీ మార్గాని భరత్‌ పిలుపునిచ్చారు. నగరంలోని విఎల్‌.పురం మార్గాని ఎస్టేట్స్‌ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఎంపీ భరత్‌ను కుడిపూడి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక జనాభా బిసిలే ఉన్నారన్నారు. సిఎం జగన్‌ బిసిల రాజకీయ ఉన్నతికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని అనడానికి కుడిపూడి నియామకమే నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు బిసిలను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే ఆయన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పది పన్నెండు స్థానాల్లో బిసిలకు ఎంఎల్‌ఎ టికెకట్లు కేటాయించాలన్నారు. ఇదే విషయాన్ని సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. బిసి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఆ సంఘీయులపైనే ఉందన్నారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో కుడిపూడిని అఖండ మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపాలన్నారు. బిసి జెఎసి ఛైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ కుడిపూడి సూర్యనారాయణ తండ్రి బీసీలకు చేసిన సేవలను గుర్తు చేశారు. తండ్రికి తగ్గ తనయునిగా కుడిపూడి సూర్యనారాయణకు మంచి పేరుందన్నారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా కుడిపూడిని ప్రకటించడం పట్ల సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎల్‌సి అభ్యర్థి కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ బిసిల్లో రాజకీయ చైతన్యం కనిపిస్తుందన్నారు. ఇది సంతోషకరమైన పరిణామమన్నారు. ఎంఎల్‌సి అభ్యర్థిగా ప్రకటించిన సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభకు కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నగర గౌడ శెట్టిబలిజ సంఘ గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్‌, అధ్యక్షుడు రెడ్డి రాజు, బార్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు ఇళ్ల శివప్రసాద్‌, పాలిక శ్రీను, పిల్లి నిర్మల, డాక్టర్‌ అనుసూరి పద్మలత, కాళ్ళ ఈశ్వరప్రసాద్‌, దుంగ మంగ, పెంకే సురేష్‌, రాయుడు గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.