ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి, సామర్లకోట రూరల్
వైసిపి ప్రభుత్వ హయాంలో కట్టేవి ఇళ్లు కాదని, ఊళ్లు అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం సామర్లకోట-జి.రాగంపేట రోడ్డులో నిర్మించిన వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలో ఇళ్లను ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. సామూహిక గృహ ప్రవేశాల నిర్వహించారు. అనంతరం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఇళ్లు లేని 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామని వెల్లడించారు. జగన్ అన్న కాలనీలో గృహప్రవేశం చేసిన ఆయన ఇంటిని నిర్మించుకున్న కుటుంబానికి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, దాడిశెట్టి రాజా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా, ఎంపీలు వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాష్ట్ర బిసి అయ్యాక కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
సామర్లకోట సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. 35 ఏళ్ల పాటు కుప్పానికి ఎంఎల్‌ఎగా ఉన్న చంద్రబాబు ఆ గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. ఒక్క పేదవానికి సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కుప్పం అభివృద్ధి చెందిందన్నారు. కంటిన్యూస్‌గా ఒక నెలపాటైనా చంద్రబాబు రాష్ట్రంలో కనిపించారా? అని ప్రశ్నించారు. ఆయనకు గాని, ఆయన్ని సమర్థించేవారికి గాని రాష్ట్రంపై అసలు ప్రేమ ఉందా? అన్నారు. దత్తపుత్రునికి హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఉందని, అయితే ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు ఒకసారి మారిపోతుంటారని విమర్శించారు. మహిళలపై, పెళ్లిళ్ల వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. భీమవరం, గాజువాకలను పవన్ యూజ్ అండ్‌త్రోగానే భావిస్తారని ఆరోపించారు. అభిమానుల ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడూ బయటకు వస్తుంటారన్నారు.
పెద్దాపురం నియోజకవర్గంపై వరాలజల్లు
సామర్లకోట బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పెద్దాపురం నియోజవర్గంపై వరాలజల్లు కురిపించారు. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలను రూ.18 కోట్లతో డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయనున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి సచివాలయానికి అదనంగా రూ.20 లక్షల అభివృద్ధి నిధులు దొరబాబు విజ్ఞప్తి మేరకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాండ్రకోటలో అభివృద్ధి పనులకు రూ.6 కోట్లు, తూర్పుపాకలలో వంతెన నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
దొరబాబును ఆశీర్వదించాలి
ప్రజలు ఆశీర్వదిస్తే 2024లో పెద్దాపురం ఎంఎల్‌ఎగా దవులూరి దొరబాబు విజయం సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దవులూరిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. వైసిపి పెద్దాపురం అభ్యర్థి దొరబాబేనని సిఎం ప్రకటించడంతో సభా ప్రాంగణంలో చప్పట్లతో మారుమోగింది. దవులూరి దొరబాబు పెద్దాపురం నియోజవర్గం అభివృద్ధికి నిరంతరం కషి చేశారన్నారు. నాయకుడంటే నిరంతరం ప్రజల మధ్యలో దొరబాబులా ఉండాలన్నారు.
పరిమితికి మించి జన సమీకరణతో ఇబ్బందులు
సామర్లకోటలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు అధికారులు పరిమితికి మించి జనాన్ని తరలించారు. సామర్లకోటలో సభ అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సిఎం గంట ఆలస్యంగా రావడంతో సభకు వచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ప్రత్తిపాడు సెంటర్లో నాలుగు రోడ్ల జంక్షన్లో నడిరోడ్డుపై మండుటెండలో ఉండిపోయారు. వేదిక వద్ద పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తరలివచ్చిన జనంతో అన్ని గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. సీఎం జగన్ గంటపాటు ఏకధాటిగా ప్రసంగించారు.










