ప్రజాశక్తి-చాగల్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాచేపట్టిన వైఎస్‌ఆర్.జగనన్న భూహక్కు భూరక్ష పథకం అమలులో క్షేత్రస్థాయిలో అధికారుల తప్పనిసరిగా పర్యటించాలని కలెక్టరు డాక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని చాగల్లు, ఊనగట్ల గ్రామాల్లో కలెక్టరు సుడిగాలి పర్యటన నిర్వహించారు. గ్రామంలోని రీసర్వే పనులను పరిశీలించారు. సంబందిత భూరికార్డులను, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించారు. కొన్నిచోట్ల ఎటువంటి అర్జీలూ నమోదు కాకపోవడం గుర్తించారు. ఈ విషయమైన సంబంధిత రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ను సర్వేకు సంబంధించిన వివరాలను కోరారు. మండల పరిధిలో 7 గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యిందని మలి దశల మరో 7 గ్రామాల్లో సర్వేను సమగ్రంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. చాగల్లు రెవెన్యూ ఇన్ప్‌పెక్టరు కె.నాగసునీత క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెకు షోకాజ్ నోటీ జారీచేయాలని ఆర్‌డిఒ మల్లిబాబును ఆదేశించారు. సచివాలయంలో రిజిస్టర్లను కలక్టరు తనిఖీ చేశారు. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ఉండాల్సిన సిబ్బంది సచివాలయంలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తన పర్యటన గురించి తెలుసుకుని వచ్చారా అంటూ సచివాలయ కార్యదర్శిని వివరణ కోరారు. చాగల్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఒపి విభాగం ద్వారా అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.










