ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా సాగింది. కొవ్వూరు డివిజన్‌లో 99శాతం పోలింగ్ నమోదైంది. ఈ డివిజన్‌లో ఓటర్లకు కొవ్వూరులోని ఎంపిడిఒ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 242 మంది ఓటర్లకు 240 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 107 మంది పురుషులకు 107 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 135 మంది మహిళలకు 133 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. హోం మంత్రి తానేటి వనిత, నిడదవోలు ఎంఎల్‌ఎ జిఎస్.నాయుడు ఇక్కడే ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పరిశీలించారు. పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.










