ప్రజాశక్తి - గోపాలపురం
కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి, శాశ్వత లైన్‌మెన్‌ను నియమించాలని గుడ్డిగూడెం గ్రామంలో పల్లపు వీధి కాలనీ వాసులు బుధవారం ధర్నా నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, శాశ్వత లైన్‌మెన్‌ను నియమించాలని నినదించారు. అనంతరం విలేకరుతో మాట్లాడారు. పంచాయతీ వెనుక ఉన్న ప్రాంతంలో సుమారు 200 పైగా ఇళ్లు ఉన్నాయన్నారు. వీటికి ఒకే ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత సరఫరా అవుతుందన్నారు. ఫలితంగా లో ఒల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కనీనసం లైట్లు కూడా వెలగట్లేదని వాపోయారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని నాలుగేళ్లుగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. గతేడాది జరిగిన జాతర సమయం నుంచి ఈ సమస్య మరింత అధికమైందని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేశామన్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. రెండేళ్లుగా లైన్‌మ్యాన్ కూడా లేకపోవడంతో విద్యుత్ సమస్యలను పరిష్కరించేవారే కరువయ్యారన్నారు. ఫీజు కూడా వేసేవారు లేక చీకట్లలోనే మగ్గిపోతున్నామన్నారు. పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కొండా శ్రీను, గండ్రోతు రామకృష్ణ, కొండ మహేష్, జక్కు అక్క రావు, దారం అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.










