కాటన్ బ్యారేజీ వద్ద 11.30 అడుగుల నీటిమట్టం
భద్రాచలం వద్ద తగ్గుముఖం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ నెమ్మదిగా వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం సాయంత్రం మూడు గంటలకు కాటన్ బ్యారేజీ వద్ద 11.30 అడుగులు, భద్రాచలం వద్ద 37.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో ఆదివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. కాటన్ బ్యారేజీకి 9,16,846 ఇన్‌ఫ్లో ఉంది. దీంతో కాటన్ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పైకి లేపి ఇన్‌ఫ్లోను నేరుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పంట కాలువలకు 11,700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి దిగువునకు జలాలను విడుదల చేయడంతో లంక గ్రామాలను వరద నీరు తాకింది. ప్రస్తుతానికి ప్రమాదం లేకున్నా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ప్రవాహం ఉంటే లంక గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీంతో లంక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతమైన పి.గన్నవరంలో కనకాయిలంక కాజ్‌వే నీట మునిగింది. అక్కడ ప్రజలు ఇంకా పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లిలో లాంచీలరేవును పూర్తిగా మూసేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో స్నానఘట్టాలను మూసేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి, పెదపట్నం లంక మధ్య పాటరేవు ప్రాంతం నీటమునిగింది. పాశర్లపూడి కరకట్ట దిగువన కాజ్‌వేకు ఇరువైపులా వరద నీరు చేరింది. పి.గన్నవరం మండలం గంటి పెదపూడికి వరదతో రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల వద్ద గోదావరి పెరగడంతో లంకల్లోకి రాకపోకలు స్తంభించాయి. లంకల్లో రైతులు బొప్పాయి పంటను వేశారు. రాకపోకలు లేకపోవడంతో పడవలపై బొప్పాయి పంటను తరలిస్తున్నారు.










