Aug 23,2023 23:55

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కొబ్బరి మనకు ప్రకతి ప్రసాదించిన కల్పవక్షం. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మానవాళికి ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్‌, కొబ్బరి పాలు తయారవుతాయి. కొబ్బరి నీరు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొబ్బరి టెంక, కొబ్బరి పీచుతో అనేక ఉపయోగాలున్నాయి. అలాంటి కొబ్బరి కోనసీమలోనే ఎక్కువగా సాగవుతోంది. జిల్లాలో పుష్కలమైన వనరులున్నా, అనేక అవకాశాలున్నా ఇక్కడి రైతాంగానికి ప్రోత్సాహం కరువైందనే చెప్పాలి.
దేశమంతా 21.40 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతుండగా అత్యధికం కేరళలో 8 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 5.17 లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 4.65 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతుంది. వాటి తర్వాత ఎపి నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 1.30లక్షల హెక్టార్లకు కొబ్బరి సాగవుతుండగా జిల్లాలో 1.36 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట పండిస్తున్నట్టు అంబాజీపేట పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. ఇక్కడ కొబ్బరి సాగులో రాష్ట్రంలోనే జిల్లాది మొదటి స్థానం. ఎకరాకు ఏటా సగటున 1,908 కాయలు దిగుబడి వస్తాయి. ఈ ఉత్పత్తుల విలువ సుమారు రూ.736 కోట్లుగా ఉంది. ప్రత్యక్షంగా లక్ష మంది, పరోక్షంగా మరో 3 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.
అక్కడ రాయితీలు, ప్రోత్సాహం ఎక్కువ
కేరళలో కొబ్బరి సాగు ఎక్కువే. అక్కడి ప్రభుత్వం కొబ్బరి ఆధారిత కుటీర పరిశ్రమలను 20 ఏళ్లుగా ప్రోత్సహిస్తోంది. కాయలను నేరుగా విక్రయించే బదులు కొబ్బరి పాలను తయారు చేసి ఆహార పదార్థాల తయారీకి, ఆయిల్‌ను వంటలకు వినియోగిస్తారు. చెట్ల నుంచి తీసే నీరా పానీయాన్ని కూల్‌ డ్రింక్స్‌ మాదిరిగా పర్యాటకులకు అమ్మకాలు జరిపుతారు. కొబ్బరినూనె, కోప్రా (ఎండుకొబ్బరి), వర్జీన్‌ ఆయిల్‌, పీచు ఉత్పత్తులు, బిస్కెట్లు, పాలు, చిప్స్‌, వివిధ రకాల డ్రింక్స్‌, పౌడర్‌, వెనిగర్‌, కళాత్మక వస్తువులు, కొబ్బరి వ్యర్థాలతో ఇటుకల తయారీ పరిశ్రమలున్నాయి. అటు తమిళనాడులో కొబ్బరి నూనె పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి విద్యుత్తు ఛార్జీల భారం తగ్గించారు. అక్కడ కూడా కేరళ మాదిరిగా అనుబంధ పరిశ్రమలు ఎక్కువగానే ఉన్నాయి. పరిశ్రమల యజమానులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కోయంబత్తూరు వంటి ప్రదేశాల్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు కావల్సిన యంత్రాలను ప్రభుత్వమే తయారు చేయించి ఇస్తుంది. దీంతో రైతులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. కురిడీ కాయల తయారీకి ఉచిత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడ అనుబంధ పరిశ్రమలేవి.?
తూర్పు గోదావరి జిల్లాలో 555 వరకు కొబ్బరిపీచు, తాళ్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. కొబ్బరి నూనె తయారీ పరిశ్రమలు నామమాత్రంగానే ఉన్నాయి. చెట్టు నుంచి నేరుగా కాయలను దించి అమ్మడం, ధర లేకపోతే కురిడీ కాయలుగా మార్చి అమ్మడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోతుంది. జిల్లాలో అత్యధిక కొబ్బరి సాగు కోనసీమలోనే ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే లక్షలమందికి ఉపాధి అవకాశాలు మెండుగా లభించే అవకాశం ఉంది. విపత్తుల సమయంలో చెట్లు కూలితే పరిహారం, కాలం చెల్లిన చెట్లను తొలగించి కొత్తవి వేసుకోడానికి సాయం చేస్తున్నారు. కాయల దింపు సమస్య పరిస్కారానికి కొబ్బరి వక్ష మిత్రులు పథకం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో పీచు, తాళ్లు, నూనె పరిశ్రమలు తప్ప ప్రభుత్వపరంగా ఇప్పటి వరకూ ఎలాంటి కొబ్బరి ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ప్రోత్సాహం కూడా అంతగా లేకపోవడంతో రైతులు నేరుగా కాయలను అమ్ముకోవాల్సి వస్తుంది.
నాబార్డ్‌ సేవలు పెరగాలి
కొబ్బరి మార్కెట్‌ స్థిరంగా ఉండదు. సీజన్లను బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ధరలు బాగా పడిపోయిన సమయంలో రైతులకు సమస్యలు వస్తున్నాయి. అలాంటప్పుడు నాబార్డ్‌ సకాలంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. నిల్వ చేసుకునే సామర్థ్యం లేని సాధారణ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ కాలం నిల్వ చేసుకునేందుకు అనుగుణంగా గిడ్డంగులు గానీ, కోల్డ్‌ స్టోరేజీలు గానీ కోనసీమలో లేవు.అందుకు తగ్గట్టుగా నాబార్డ్‌, ప్రభుత్వాలు వ్యవహరిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
రైల్వే లైన్‌ పూర్తయితే మేలు
కోనసీమకు రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ ఇప్పటికీ నెరవేరలేదు. అదే జరిగితే, కొబ్బరి ఎగుమతులను మెరుగ్గా రవాణా చేయొచ్చని, కేరళ తరహాలో కోనసీమలో కొబ్బరి వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. కేరళ, తమిళనాడులతో పోలిస్తే ఎపిలో కొబ్బరి పరిమాణం చిన్నదిగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయినా, ఎపి కొబ్బరికి మంచి డిమాండ్‌ ఉంది. రాజస్థాన్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతోంది.